మన తెలంగాణ/హైదరాబాద్ : పైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఎపి హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అక్టోబర్ 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయవద్దని పోలీసులనుహైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేశ్ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరువర్గాల వాదన విని కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
అంతకు ముందు ఇన్నిర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించిన అక్రమ కేసులో ఎపి హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ14గా చేర్చిన నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. సిఆర్‌పిసిలోని 41ఎ కింద లోకేష్‌కు నోటీసులు ఇస్తామని ఎజి అన్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారి ఎఫ్‌ఐఆర్‌లో మార్పు చేశారని కోర్టుకు నివేదించారు. 41ఎ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని, విచారణకు సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకొస్తామని ఎజి వివరించారు.
దీంతో సిఆర్‌పిసి 41ఎ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రాదు కాబట్టి ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.