హైదరాబాద్ : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి వదంతులను నమ్మవద్దని భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేసింది. శ్రీవారి ఆలయ ఆనందనిలయంలో బంగారు తాపడం పనుల కోసం స్వామి వారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలను టిడిడి ఖండించింది. శుక్రవారం ఈ అంశానికి సంబంధించి వాస్తవాలను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు వెల్లడించారు. టిటిడి ఆగమ సలహామండలి సూచనల మేరకు శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించిన ఆరు నెలల్లో పూర్తి చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి ఒకటో తేదీన ముహుర్తంగా నిర్ణయించారన్నారు. ముందుగా వారం రోజులు పాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారన్నారు.
దీనిలో భాగంగా గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు (కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహంలోకి ప్రవేశపెడతారని చెప్పారు. అనంతరం ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపతారని ఆయన వివరించారు. ఆ తర్వాత ఆనందనిలయానికి బంగారుతాపడం పనులు చేపడతారన్నారు. అందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యధావిధిగా దర్శించుకోవచ్చు అని చెప్పారు. బాలాలయంలోని దారు విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చని తెలిపారు. గర్భాలయంలో మూలమూర్తిని భక్తులు యాధావిధిగా దర్శించుకోవచ్చన్నారు.
గర్భాలయంలో మూలమూర్తికి ఆర్ధిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. గర్భాలయంలో మూలమూర్తికి, బాలాలయంలోని దారు విగ్రహానికి ఉదయం సుప్రబాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవలు ఆగమోక్తంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి నిర్వహించే కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యాధావిధిగా జరుగుతాయని ఆయన వెల్లడించారు. 1957వ సంవత్సరంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం జరిగిన సందర్భంలోనూ, అలాగే 2018లో శ్రీవారి ఆళయంలో బాలాలయం నిర్వహించిన సందర్భంలో ఉన్న రికార్డుల ప్రకారం భక్తులకు శ్రీవారి మూలదర్శనం, ఉత్సవ మూర్తులకు కళ్యాణోత్సవం , అర్ధిత బ్రహ్మోత్సవం తదితర సేవలు నిర్వహించడం జరిగిందని వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు.