కార్యకర్తలకు డిఎంకె అధినేత స్టాలిన్ పిలుపు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె సారథ్యంలోని కూటమి విజయం సాధించనున్నట్లు వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పిన నేపథ్యంలో మే 2న జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గుమికూడడం లేదా ఇతర ప్రాంతాలలో అట్టహాసరంగా విజయోత్సవ సంబరాలు జరపడం వంటివి చేయవద్దని డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. విజయోత్సవాలను తమ ఇళ్లకే పరిమితం చేసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో కొవిడ్-19 మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై స్టాలిన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆసుపత్రులలో ఆక్సిజన్, పడకల కొరతతో తీవ్రంగా బాధపడుతున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె అత్యధిక స్థానాలను గెలుచుకోనున్నట్లు వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన శుభ సమయంలో రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చి విజయోత్సవాలను చేసుకోవడం వల్ల వారికి కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని, అందుకే కార్యకర్తలు తమ ఇళ్లకే పరిమితమై సంబరాలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమిలోని ఇతర పార్టీల కార్యకర్తలకు కూడా ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.