Friday, November 22, 2024

కేంద్రం నో అన్నది.. యాసంగిలో వరి వద్దు

- Advertisement -
- Advertisement -

Minister Niranjan Reddy Comments On Purchase Of Paddyపంటల సేకరణ బాధ్యతలనుంచి తప్పుకొన్న కేంద్రం
యాసంగిలో వరిధాన్యం కొనేది లేదు
ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, విత్తనోత్పత్తుల కింద
కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు యాసంగిలో వరి
సాగుచేసుకోవచ్చు : మంత్రి నిరంజన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగిలో వరిపంట సాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరోమారు స్పష్టం చేసింది. రాజ్యంగం ప్రకారం రైతులు నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే..కేంద్రం తన బాధ్యతలనుంచి తప్పించుకొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులనుంచి పంటలు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేసే ఆధికారం లేదు . ఈ పరిస్థితుల్లో ఇక ప్రతియేటా యాసంగి వరిధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం లేదు ..అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. వర్షాకాలం ధాన్యాన్ని మాత్రమే ప్రతియేటా కొనుగోలు చేస్తామని , యాసంగి ధాన్యాన్ని కొనేది లేదని కరాఖండిగా చెప్పేశారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డితోపాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం సేకరణ పట్ల ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు.

మంత్ర నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విత్తనోత్పత్తుల కింద కంపెనీలతో ఒప్పదం ఉన్న రైతులు యాసంగిలో నిరభ్యంతరంగా వరిసాగు చేసుకోవచ్చని తెలిపారు. నిజామాబాద్ , కామారెడ్డి, సూర్యాపేట , నల్లగొండ తదితర జిల్లాల్లో కొంత మంది రైతులు వరి పండించి ధాన్యం నేరుగా మిల్లర్లకే అమ్ముకునే సాంప్రదాయం ఉందని, అటువంటి వారు కూడా యాసంగిలో వరిసాగు చేసుకుంటే అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్న ఆశలు ఉన్న రైతులు మాత్రం యాసంగిలో వరిసాగు చేసుకోవద్దని తేల్చిచెప్పారు. ఇక నుంచి వానాకాలం పండించే ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభుత్వం విధాన పరమైన నిర్ణమం తీసుకుందని తెలిపారు. యాసంగిలో వరికి బదులు వేరుశనగ, మినుము, పెసర , పొద్దుతిరుగుడు, తదితర ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని , అందుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని వెల్లడించారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి గల కారణాలను మంత్రి వివరిస్తూ యాసంగిలో దొడ్డు రకాలు అధికంగా సాగు చేస్తున్నారని, ఈ రకం ధాన్యం అధికంగా నూక అవుతుందన్నారు. ఇవి ఉప్పడు బియ్యానికే అధికంగా వాడుతున్నందున కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా ఉప్పుడుబియ్యం కొనుగోలు చేయమని చేతులెత్తేసిందన్నారు.

కోవిడ్ కారణంగా కేంద్రం పేదలకు ఈ నవంబర్ వరకూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా బయ్యం పంపిణీ చేస్తోందని , ఈ పథకాన్ని మరికొన్ని నెలలపాటు పొడింగించి ధాన్యం సేకరణ ఎందుకు చేయకూడదని కేంద్రాన్ని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్రం మాట ఇచ్చిన నేపథ్యంలో తీసుకొన్న ధాన్యంలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా తెలంగాణ ప్రభుత్వం వద్దనే మూలుగుతోందన్నారు. కేంద్రం బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనం అన్నారు. దేశంలో పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి ఒక విధానం అంటూ లేదన్నారు. ధాన్యం రైతులను ఏమార్చడం , మోసగించడం సరైన పద్దతి కాదని సూచించారు. భారత ఆహార రంగాన్ని కార్పోరేట్లకు ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం ధాన్యం కొనుగోళ్ల బాధ్యతనుండి తప్పుకొంటొందన్నారు. రాష్ట్రంలో కొన్ని రాజకీయపార్టీల నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వారి స్వార్ధరాజకీయ ఉచ్చులో పండకుండా రైతులు వాటిని అర్ధం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డిలో రైతు మరణం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వం దీనిపై నివేదిక తెప్పించుకుందన్నారు. మాగాణి అంటే నీటిపారుదల కింద పండే పంటలని , అందులో వరితోపాటు ఇతర పంటలు కూడా ఉంటాయన్నారు. ఒకప్పుడు వర్షాధారం కింద ఉన్న తెలంగాణ ప్రాంత వ్యవసాయరంగానికి ఇప్పుడు ప్రాజెక్టుల నిర్మాణంతో పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు.

వ్యవసాయరంగం పట్ల , రైతుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్న చిత్తశుద్దిని ఎవరూ శంకించే అవకాశమే లేదన్నారు. వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోని మరే రాష్ట్రలో లేవని తెలిపారు. సిఎం కెసిఆర్ నిండుమనసుతో వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దారన్నారు. కష్టపడి సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామన్నారు. సిఎం కెసిఆర్ వ్యవసాయరంగం పట్ల చేసిన కృషి ఫలితంగానే వానాకాలంలో కోటి 41లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయని అందులో 62.8లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చిందని తెలిపారు. వరిసాగులో ఇబ్బందులను గత నాలుగు నెలలనుంచే ప్రభుత్వం రైతుల దృష్టికి తీసుకుపోయి వారిని చైతన్య పరుస్తోందన్నారు. వానాకాలంలో మాత్రం సన్నరకాలైనా , దొడ్డురకాలైన పండిన ధాన్యమంతటినీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.

పత్తిపంటను పెంచమన్నాం:

వానాకాలం పత్తిపంట సాగును పెంచమని రైతులకు సీజన్‌కు ముందునుంచే విజ్ఞప్తి చేశామన్నారు. కాని అనుకున్నంతగా పత్తి విస్తీర్ణం పెరగలేదన్నారు. ఇప్పుడు పత్తికి మద్దతు ధరకంటే రూ.3వేలు అధికధర లభిస్తోందన్నారు. సిసిఐ మద్దతు ధరకు మించి ఎక్కువ ధర వచ్చిందన్నారు. కోటి ఎకరాల్లో పత్తిసాగుచేసినా సరే రైతులకు మద్దతు ధర దక్కుతుందన్నారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందన్నారు.

నాణ్యమైన వరివంగడాలు రావాలి:

తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా నాణ్యమైన వరివంగడాలు కావాలని జాతీయ వ్యవసాయ పరిశోధనాసంస్థకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. నూకరాని వరి విత్తనపు అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా కోరామన్నారు.నూక లేని నూతన వంగడాలపై పరిశోధనలు జరగాలన్నారు.రాష్ట్రంలో యాసంగి పంటల సాగు సీజన్‌ను ముందుకు జరుపుకోవాలన్నారు. రైతులు కూడా ఒక నెల ముందుగానే పంటలు సాగుచేసుకుంటే అకాల వర్షాలు , వడగండ్ల వానలు తదితర ప్రకృతి వైపరిత్యాలనుంచి పంటలను కాపాడుకోవచ్చని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

6570కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్దం:మంత్రి గంగుల

రాష్ట్రంలో రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు 6570కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటివరకూ 2.36లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రైవేటు మిల్లర్లవద్ద టోకెన్‌పద్దతి ఉందని అయితే అది సూర్యాపేట , నల్లగొంఒడ జిల్లాలకే పరిమితం అని మంత్రి తెలిపారు.ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు,పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News