Sunday, September 22, 2024

యాసంగిలో వరి వద్దు

- Advertisement -
- Advertisement -

Do not cultivate Paddy in Yasangi:TS Govt

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యాన్ని అపండి
కలెక్టర్లకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో వరి సాగుచేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని కోరింది. అదే విధంగా గత వానాకాలంలో పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనని తెగేసి చెప్పిందని, అందుచేతనే వరికి బదులుగా ఇతర పత్యామ్నాయ పంటలను సాగుచేసుకునే విధంగా రైతులను కోరాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చెప్పారు.

తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్టా యాసంగిలో పండించే ధాన్యం పారాబాయిల్ రైస్‌కే పనికి వస్తాయని, అయితే ఈ రకం బియ్యం ఎఫ్‌సిఐ ద్వారా సేకరించేది లేదని కేంద్రం ఖరాఖండిగా ప్రకటించిందని సిఎస్ వెల్లడించారు. విత్తన కంపెనీలతో ఒప్పందాలు ఉన్న రైతులు, ధాన్యం కొనుగోలుకు మిల్లర్లతో ఒప్పందాలు ఉన్న రైతులు , సొంత అవసరాలకు ధాన్యం ఉపయోగించుకునే రైతులు వరి సాగు చేసుకోవచ్చని అయితే అది వారి సొంత రిస్క్ అని ఇందులో ప్రభుత్వ జోక్యం ఏవిధంగానూ ఉండదని రైతులకు ముందుగానే వివరించాలని సిఎస్ సోమేశ్ కుమార్ కలేక్టర్లను ఆదేశించారు. ఇతర ప్రాంతాలనుంచి కొందరు ధాన్యం ఇక్కడి కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నట్టు సమాచారం వస్తోందన్నారు.

ఇతర ప్రాంతాల ధాన్యం ఇక్కడికి రాకండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను , ఎస్పీలను ఆదేశించారు. తెలంగాణలో వర్షాకాలం రైతులు పండించిన ధాన్యం నుంచి 40లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్‌సిఐ ద్వారా సేకరించేందుకు కేంద్రం తెలంగాణకు కోటా ఇచ్చిందన్నారు. ఇతర ప్రాంతాల ధాన్యం ఇక్కడికి వస్తే ఈ ప్రాంత ధాన్యం రైతులు నష్టపోతారని హెచ్చరించారు. రాష్ట్రంలో అవసరమైన ప్రతిచోట కొత్తగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టరలు, వ్యవసాయ, పౌరసరఫరాల అధికారులు తరుచూ సందర్శించాలని, ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాలనుంచి వస్తున్న ధాన్యం మిల్లులకు చేరగానే వెంటనే ధాన్యం బియ్యంగా మిల్లింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు బియ్యం నిల్వలను గిడ్డంగులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లులకు వచ్చే ధాన్యం నిల్వ చేసేందుకు తగిన వసతి ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్దికశాఖ ప్రత్యేక సిఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ సిఎస్ సందీప్ కుమార్ సుల్తానియాతోపాటు ఎస్‌ఏఎం రిజ్వా, అనిల్ కుమార్ , రఘునందన్ రావు, క్రిష్టినా, కె.ఎస్ శ్రీనివాసరావు, వి.అనిల్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News