Monday, March 31, 2025

 చెట్లు నరకడం హత్యకన్నా ఘోరం

- Advertisement -
- Advertisement -

చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా దారుణమని , నరికివేయబడిన ప్రతి చెట్టుకు రూ. లక్ష చొప్పున బాధ్యులకు సుప్రీం కోర్టు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పడం అపూర్వ సంఘటన. కాలుష్యం నుంచి తాజ్‌మహల్‌ను రక్షించడానికి చుట్టూ 10,400 కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లను అక్రమంగా నరికివేయకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుగా తాజ్ ట్రపీజియమ్ జోన్ ఏర్పాటైంది. దీని పరిధి లోని మథురబృందావన్ లోని దాల్మియా ఫామ్స్‌లో 454 చెట్లు అక్రమంగా నరికి వేయబడ్డాయి. ఈ చెట్ల నరికివేతకు బాధ్యుడైన శిశ శంకర్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. . పర్యావరణానికి హాని కలిగించే విషయంలో దయచూపకూడదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

నరికివేతకు గురైన 454 చెట్ల పచ్చదనాన్ని తిరిగి పునరుద్ధరించాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుందని హెచ్చరించింది. ఈ తీర్పు ప్రాజెక్టుల పేరుతో అడ్డదిడ్డంగా అడవులను నరికివేస్తున్న ప్రస్తుత ప్రపంచానికి ఒక హెచ్చరిక అని చెప్పక తప్పదు. అడవులు భూమికి ఊపిరితిత్తులు వంటివి. గాలినిశుభ్రం చేయడమే కాదు, వాతావరణ సమతుల్యతను కాపాడుతుంటాయి.ఐక్యరాజ్య సమితి 2010 అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 16 మిలియన్ల టన్నుల అడవులు ధ్వంసం అవుతున్నాయి. ఇది అమెరికా లోని మిచిగన్ రాష్ట్ర పరిమాణంతో సమానం. దేశ వ్యాప్తంగా 30 మిలియన్ ఎకరాల అడవులు నాశనమవుతున్నాయి. సాధారణంగా ఒక చెట్టు ఒక కిలో కొత్త కలప తయారీకి 1.47 కిలోల కార్బన్‌డైయాక్సైడ్‌ను గ్రహించి 1.07 కిలోల ఆక్సిజన్ అందిస్తుంది.

ఎకరం విస్తీర్ణంలో గల చెట్ల నుంచి 18 మందికి జీవితాంతం సరిపడే ఆక్సిజన్ లభిస్తుంది. ఆఫ్రికా ఖండంలో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటే ఉద్యమాన్ని చేపట్టినందుకు ప్రొఫెసర్ వంగరి మథమ్ 2004 లో నోబెల్ బహుమతిని సాధించ గలిగారు. కార్బన్‌డైయాక్సైడ్‌ను గ్రహించడంలో వెదురు వనాలు కీలక పాత్ర వహిస్తాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీమా రకం వెదురు మొక్కల్లో ఒక మొక్క ఒక సంవత్సర కాలంలో 500 కిలోల కార్బన్‌డైయాక్సైడ్‌ను గ్రహించి 350 కిలోల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. భూమిపై 33 శాతం అడవులు ఉన్నప్పుడే మనం పీల్చేందుకు గాలి లభిస్తుంది.1739 లో బెంజిమిన్ ఫ్రాంక్లిన్ నేతృత్వంలో ఫిలడెల్ఫియా నగరవాసులు వ్యర్థపదార్థాల నిర్మూలనను ఒక ఉద్యమంగా చేపట్టి పర్యావరణ ఉద్యమానికి అంకురార్పణ చేయగా, 1949లోఆల్టోలియో పాల్డ్ అనే అమెరికా పర్యావరణ వేత్త తన రచనల ద్వారా పర్యావరణ కాలుష్యం వల్ల సమాజం ఎదుర్కొనే సమస్యలను ఎత్తి చూపడం జరిగింది.

1970 ప్రాంతంలో ఉత్తరాంచల్ లోని ఘర్‌వాల్ జిల్లా లోని గోపటేశ్వర్ అనే గ్రామంలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా నిరక్షరాస్యులైన చాందీ ప్రసాద్ బిట్టా అనే సాధారణ మహిళ తన గ్రామ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రారంభించిన నిరసనే పర్యావరణ వాదానికి తొలిమెట్టు గా చెప్పవచ్చు. తరువా త ఉత్తర భారతంలో అడవుల సంరక్షణ కోసం ఎస్. బహుగుణ నేతృత్వంలో చిప్కో ఉద్యమం సాగిన సంగతి తెలిసిందే. మహిళల్లో చిప్కో ఉద్యమం చైతన్యం కలిగించింది. చిప్కో ఉద్యమం మాదిరిగానే నార్వే దేశ పర్యావరణ వేత్త వాంగరీమాతై గ్రీన్‌బెల్ట్ ఉద్యమం చేపట్టి 30 సంవత్సరాల పాటు మహిళల్లో చైతన్యం కలిగించి 3 కోట్ల మొక్కలు నాటించారు. దేశంలో పర్యావరణ సంరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వేతర సంస్థలు అనేకం ఉన్నాయి. చెట్లను, అడవులను పరిరక్షించుకోవడం ఎంతో అవసరం. చెట్లు భూసారాన్ని కాపాడుతాయి. సూర్యరశ్మిని అడ్డుకుంటాయి.

నేల పొడిబారి ఎడారి కుండా రక్షిస్తాయి. బొగ్గుపులుసు వాయువులను పీల్చుకుని భూమి ఉష్ణోగ్రతలు అంటే భూతాపం పెరగకుండా చూస్తాయి. వరదలను నియంత్రిస్తాయి.భూగర్భజలాలు పెరిగేలా సహకరిస్తాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల వర్షాలు తగ్గి పర్యావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. 33 శాతం ఉండాల్సిన అడవుల విస్తీర్ణం మనకు 13 శాతం కూడా ఉండడం లేదు. 50 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు అందించే సేవల విలువ ఎంతో లెక్కగడితే మనం చెట్లు విలువ గమనించగలుగుతాం. పరోక్ష ఉపయోగాలు తెలుసుకోగలుగుతాం.50 సంవత్సరాల్లో ఒక చెట్టు నుంచి 2.50 లక్షల విలువైన ప్రాణవాయువు, ఆక్సిజన్ ఉత్పత్తి లభిస్తుంది. పక్షులు, చిన్న జంతువులు, కీటకాలు, వల్ల అందించే ఉపయోగం విలువ 2.50 లక్షల విలువ చేస్తుందని చెబుతున్నారు. గాలిలో తేమ నియంత్రణ, నీటిని శుభ్రం చేయడం వల్ల 3 లక్షల విలువైన ప్రయోజనం కలుగుతుంది.

ఒక చెట్టును నరకడం వల్ల పర్యావరణ సమతుల్యతకు రూ.15.70 లక్షల విలువ నష్టమవుతుంది. మొత్తం మీద ఒక చెట్టు నిజమైన విలువ మొత్తం రూ. 16 లక్షలు అవుతుందని తెలుసుకోవాలి. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు 50 ఏళ్లకు పైబడిన చెట్లను నరకరాదని 2012లో ఒక నిబంధన ప్రభుత్వాల నుంచి వెలువడింది. దేశంలో చెట్లను పరిరక్షించే చట్టం 1994లో అమలులోకి వచ్చింది. క్రీస్తుపూర్వం 268 లోనే అశోకుడు చెట్లు నాటించాడని శాసనాలు చెబుతున్నాయి. రైతులు తమ పొలాల గట్లపై వృధా భూముల్లో ముల్లో, ఏగిస, మద్ది, తుమ్మ, వేప, నేరేడు, మర్రి, రావి చెట్లను పెంచితే ఉష్ణోగ్రత 3 నుండి 4 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రతివ్యక్తి పది మొక్కలు నాటి అవి పెరిగి పెద్దదయ్యేలా శ్రద్ధ వహించాలని, పర్యావరణానికి మనం ఏదైతే చేస్తామో , పర్యావరణం నుండి తిరిగి అదే మనం పొందుతామని శాస్త్రవేత్త ఎపిజె కలాం సూచనలు గుర్తు తెచ్చుకోవడం అవసరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News