Monday, December 23, 2024

పోలీసు పరీక్ష ఫలితాలు ప్రకటించొద్దు

- Advertisement -
- Advertisement -

పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు నియామక బోర్డు (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) ఫలితాలపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. ఆగస్టు 17 వరకు ఫలితాలు విడుదల చేయవద్దని పోలీసు నియామక బోర్డును హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జీవో నెంబర్ 57, 58కు సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థులు హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది.

మరోవైపు ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ తుది అంకానికి చేరింది. వారంరోజుల్లోపే అభ్యర్థుల తుది ఎంపికల జాబితా వెల్లడించడానికి పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేస్తోంది. తుది రాతపరీక్షలో ఎంపికైన వారిలో నుంచి 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో నుంచే కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు. ఎస్‌ఐల ఎంపికకు మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీల ఆధారంగా, కానిస్టేబుళ్ల ఎంపికకు జిల్లాల్లోని ఖాళీలకు అనుగుణంగా కటాఫ్ మార్కుల్ని నిర్ణయి స్తున్నారు. సామాజిక వర్గాల వారీగా, మహిళలు, పురుషులు, ప్రత్యేక కేటగిరీలు, రోస్టర్ పాయింట్లు ఇలా దాదాపు 180కిపైగా అంశాలను పరిగణనలోకి తీసుకొని కటాఫ్ మార్కులు నిర్ణయించాల్సి ఉన్నందున కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. అంతా సవ్యంగా సాగితే ఈ నెల రెండో వారంలో జాబితా వెలువడే అవకాశముంది. అయితే మొదట ఎస్‌ఐలుగా ఎంపికైన 579, ఎఎస్‌ఐలుగా ఎంపికైన ఎనిమిది మంది జాబితాలను వెల్లడించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తుది రాతపరీక్షలో ఎంపికైన 97,175 మందిలో పలువురు ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు రెండింటికీ పరీక్షలు రాశారు. తొలుత ఎస్‌ఐ విజేతల్ని ప్రకటిస్తే బ్యాక్‌లాగ్‌లను నివారించవచ్చనేది నియామక మండలి ఆలోచన. ఎస్‌ఐగా ఎంపికైన వారి నుంచి కానిస్టేబుల్ పోస్టును వదులుకుంటామని అండర్ టేకింగ్ తీసుకుంటారు. ఇలా చేస్తే ఖాళీ అయిన కానిస్టేబుల్ పోస్టు స్థానంలో మరొకరు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News