మనతెలంగాణ, సిటీబ్యూరో: చెరువుల్లో నిర్మాణ అనుమతులు మంజూరైన భవనాలను హైడ్రా కూల్చివేయదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. కూల్చివేస్తారంటూ, చర్యలు తీసుకుంటారంటూ హైడ్రాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ భయాందోళనలను సృష్టిస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మరాదనీ రంగనాధ్ తేల్చిచెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని, చెరువుల్లో అనుమతులున్న నిర్మాణాలకు ఏలాంటి ఇబ్బంది ఉండదనీ, హైడ్రా వాటిని కూల్చివేయదని కమిషనర్ స్పష్టంచేశారు.
చట్టబద్ధమైన అనుమతులు ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌ల వారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. చెరువుల దగ్గర వచ్చే నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుందని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, హైడ్రా చట్టపరంగా చర్యలు తీసుకుంటుందనీ, అనుమతులు లేకుండా కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలను చట్టం పరిధిలోనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంగనాథ్ వివరించారు. నిర్మాణాలకు అనుమతులను సమగ్రంగా పరిశీలన, తనిఖీలు చేసిన అధికారులు చట్టబద్ధంగా అనుమతిస్తున్నారని తెలిపారు. మునిసిపల్ చట్టం ప్రకారంగా అనుమతులను పొందిన నిర్మాణాదారులను హైడ్రా ఏమీ అనదని పేర్కొన్నారు.