మన తెలంగాణ/సిరిసిల్లా/హైదరాబాద్: గవర్నర్ల వ్యవస్థ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. బ్రిటీష్ కాలం నాటి ఈ వ్యవస్థ ప్రస్తుతం దేశానికి అవసరమా? అని ప్రశ్నించారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి, పెత్తనం చెలాయించడానికే గవర్నర్ వ్యవస్థ ఉపయోగపడుతోందని ఆరోపించారు. రాజ్‌భవన్‌ను రాజకీయ కా ర్యకలాపాలకు వేదికగా మార్చుతున్నారని విమర్శించారు. అందుకే దేశంలో గవర్నర్ల వ్యవస్థ పట్ల ప్రజల్లో చులకన భావం నెలకొందన్నారు. సోమవారం సిరిసిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, మరోసారి గవర్నర్ల వ్యవస్థపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ పదవికి బ్రిటీష్ కాలంలో ఒక అర్థం ఉండేదన్నారు. అప్పట్లో కేంద్రంలో వైశ్రాయ్, రాష్ట్రంలో గవర్నర్‌లు నేరుగా పరిపాలన సాగించే విధానం ఉండేదన్నారు. కానీ భారత్‌దేశం వంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయన్నారు.
ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రులు ఉంటారన్నారు. ఈ నేపథ్యంలో ఇక గవర్నర్ వ్యవస్థతో పనేముందన్నారు. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ తన ప్రధాన మంత్రి పదవి పేరును వైశ్రాయ్ అన్న పేరును అయినా మార్చుకోవాలి? లేక దేశంలో గవర్నర్ల వ్యవస్థనైనా ఎత్తేయాలని సూచించారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన కూడా గవర్నర్ల వ్యవస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. కానీ ప్రధాని అయిన తరువాత ఆ విషయాన్నే మరించిపోయారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం గవర్నర్లను అడ్డం పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చెలాయిస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ ఇతరులను చెప్పేముందు ఆయన ఆలోచించుకుంటే మంచిదన్నారు. బ్రిటిష్ బానిసత్వానికి ప్రతీకలుగా ఉన్నవాటిని తొలగించాలని, బానిస మనస్థత్వాన్ని విడిచి పెట్టాలని ఇటీవల ప్రధాని మోడి 75వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో అన్నారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. మరి గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్‌వారి బానిసత్వానికి ప్రతీకగా కొనసాగడం లేదా? దీనిపై మోడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించే సంస్కృతి తమది
రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చొద్దని కెటిఆర్ సూచించారు. అది దేశానికి మంచిది కాదన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించే సంస్కృతి తమదన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వారు కూడా పార్టీలకు అనుకూలంగా, పార్టీల ప్రతినిధులుగా పార్టీల చర్చల్లో పాల్గొనడం, రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటని మానుకుంటే మంచిదన్నారు.
రాజకీయాల్లో ఉన్న వారికి గవర్నర్ పదవి ఇవ్వొద్దు
రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ పదవి ఇవ్వొద్దని గతంలో మోడీనే చెప్పారని కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కనీసం రెండేండ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న వారికే గవర్నర్ పదవి ఇవ్వాలని మోడీ చెప్పారన్నారు. కానీ ఇవాళ మోడీ దానిని పాటిస్తున్నారా? ప్రశ్నించారు. సిఎంగా నీతులు చెప్పిన ఆయన ప్రధానగా మాత్రం ఆ నీతులను తుంగలో తొక్కుతున్నాడని విమర్శించారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులను ప్రజలు ఎన్నుకుంటారన్నారు. మరి గవర్నర్లు ఎవరు ఎన్నుకుంటారని ప్రశ్నించారు. సర్కారీయా కమిషన్… ఫూంచ్ కమిషన్ కూడా ఇదే చెప్పిందన్నారు.
విభజన హామీల్లో ఏ ఒక్కటిని నెరవేర్చలేదు
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కెటిఆర్ అన్నారు. ఇందులో తాను చెప్పింది తప్పు అయితే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ పట్ల మోడీ ప్రభుత్వం మొదటి నుంచి వివక్ష చూపిస్తోందన్నారు. అందుకే ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చడానికి మోడీ సుముఖంగా లేరన్నారు. ఎపి పునర్విభజన చట్టంలో ఎన్నో రకాల హామీలు, వాగ్దానాలు కేంద్రం చేసిందన్నారు.. రాష్ట్రానికి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కొత్త విద్యా సంస్థలు ఇస్తామని చెప్పిందన్నారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటు చేసే పారిశ్రామిక కారిడార్లు రాయితీలు ఇస్తామని పేర్కొన్నదన్నారు. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య కూడా పెంచుతామన్నారన్నారు. కానీ ఇప్పటి వరకు కనీసం ఒక్కటంటే ఒక్క హామీనైనా కేంద్రం నెరవేర్చడానికి చిన్న ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా లేవని ఆయన తీవ్ర అసంతృప్త వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. పైగా తెలంగాణ సొమ్మునే కేంద్రం వాడుకుందన్నారు.
మాటను నిలుపుకునేందుకు ఇదే చివరి అవకాశం
తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీకి ఇదే చిట్ట చివరి అవకాశమని (బడ్జెట్) కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దఎత్తున నిధుల కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో సంవత్సరన్నర వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని…ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లలోగా 2024లో ప్రవేశపెట్టే బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికే మాత్రం అవకాశముందన్నారు. దీనికి లెక్కాపత్రం ఉండదు… నిబద్ధత కూడా ఉండదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం కొత్తగా బడ్జెట్‌ను పెట్టుకోవచ్చునని… లేదా? బడ్జెట్‌ను సవరించుకోనేందుకు అవకాశముంటుందన్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పెట్టే బడ్జెట్‌కు మాత్రమే విలువ ఉంటుందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై భారీగా నిధులు కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిపి అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, పవర్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు అధ్యక్షులు గడ్డం నర్సయ్య, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణితో పాటుగా పలువురు బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.