ఐక్యరాజ్యసమితి: అఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు వినియోగించొద్దని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దని ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. భద్రతా మండలిలో భారత్ ప్రస్తుతం అధ్యక్షస్థానంలో ఉన్నది. కాబూల్‌ను తాలిబన్లు వశపరచుకున్న తర్వాత భద్రతా మండలిలో చేసిన మొదటి తీర్మానం ఇదే. ఈ తీర్మానం భారత్‌కు ఎంతో ప్రాధాన్యత కలిగినదని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ష్రింగ్లా తెలిపారు. అఫ్ఘనిస్థాన్‌పై తీర్మానానికి తాను అధ్యక్షత వహించడం సంతోషంగా ఉన్నదని ష్రింగ్లా అన్నారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంగానీ, ఆర్థిక తోడ్పాటు అందించడంగానీ అఫ్ఘన్ నుంచి జరగొద్దని భద్రతామండలి తీర్మానం 1267లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆగస్టు 26న కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడుల్ని భద్రతామండలి తీవ్రంగా ఖండించింది. అయితే,మండలిలో 15 సభ్య దేశాలుండగా, 13 అనుకూలంగా ఓటేశాయి. చైనా,రష్యా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.