Monday, December 23, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై నిర్లక్షం చేయొద్దు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు డబ్బులేని పేదలు వస్తారని వారి పట్ల నిర్లక్షంగా ఉండకుండా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు న్నారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని హరీశ్‌రావు ఆకస్మికంగా సందర్శించారు. అందులోని ప్రతి వార్డు తిరిగి అక్కడ ఉండే గర్భిణులతో, వారి అటెండర్‌తో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను తెలుసుకున్నారు.

ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, మందులు సక్రమంగా అందుతున్నాయా, వైద్యం బాగుందా లేదా అన్న వివరాలను పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని రకాల మందులను అందుతాయి కాబట్టి ఎక్కడైనా సమన్వయ లోపం వల్ల మందులు సరైన సమయానికి పేషెంట్లకు అందుతున్నాయా లేవా అన్న వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటామని, మీరు ఇచ్చే సమాధానం నాకు ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.

ఇప్పటి వరకు వారికి అవసరం ఉన్న అన్ని మందులను ఆసుపత్రి వారే సమకూర్చి ఇచ్చారని అన్ని రకాల పరీక్షలను ఆస్పత్రిలోనే చేశారని పేషంట్లు సమాధానం ఇచ్చారు. తర్వాత పిల్లల ఇన్ పేషంట్ వార్డుని సందర్శించిన మంత్రి అందులో అడ్మిట్ అయిన పిల్లలను పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వమే అన్ని రకాల మందులతో పాటు టెస్టులను కూడా చేస్తుందని బయట ప్రైవేట్‌లో చేయించుకోవద్దని మంత్రి వారి తల్లిదండ్రులకు సూచించారు.

డాక్టర్లు విధులు నిర్వహించే తొమ్మిది నుండి నాలుగు గంటల సమయం వరకు విధుల్లో లేని డాక్టర్లపైన తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సూపరిండెంట్‌లకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అనధికారికంగా లీవులు పెట్టిన వారిని మందలించి చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల వైద్య పరికరాలను, వైద్య సదుపాయాలను సమకూర్చిన నేపథ్యంలో వైద్యులు సమయానికి విధుల్లో ఉండి ప్రజలకు సేవలు అందించాలని మంత్రి తెలిపారు.

అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోతే పేషెంట్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా వైద్యులు సమన్వయంతో పని చేయాలని మంత్రి అన్నారు. బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయవలసిందిగా మంత్రి కలెక్టర్, సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

స్వరాష్ట్రంలో సుపరిపాలన కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అట్లా ఏర్పాటు చేసుకున్న అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారని అందులో భాగంగా జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందింజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉందని అందుకు అనుగుణంగా వైద్యులు అధికారులు పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి తెలిపారు.

ఇప్పటికే అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి పరికరాలను, వైద్యులను, ప్రొఫెసర్లను, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం నియమించింది అని మంత్రి తెలిపారు.అనంతరం వైద్యుల హాజరు పట్టికను తనిఖీ చేసి సూపరింటెండెంట్, వైద్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జగిత్యాల జిల్లా జడ్పీ చైర్‌పర్సన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News