మీడియాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా టూల్‌కిట్ అందచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ కార్యకర్త దిశా రవిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన దర్యాప్తుపై కొన్ని మీడియా సంస్థలు ప్రచురిస్తున్న, ప్రసారం చేస్తున్న కథనాలు సంచలనాత్మకం, స్వీయ విచారణగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అభివర్ణించింది. అయితే ఈ కథనాలను, ట్వీట్లను తొలగించాలంటూ ఢిల్లీ పోలీసులు చేసుకున్న మధ్యంతర అభ్యర్థనపై ఉత్తర్వులు జారీచేయడానికి కోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని తదుపరి దశలో పరిశీలిస్తామని జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ తెలిపారు.
దర్యాప్తునకు అవరోధం కలిగించే అవకాశం ఉన్నందున దర్యాప్తునకు సంబంధించిన బయటకు వచ్చే ఎటువంటి సమాచారాన్ని ప్రసారం చేయవద్దని మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. అంతేగాక మీడియాకు ఎటువంటి సమాచారాన్ని లీక్ చేయబోమని ఇచ్చిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉండాలని ఢిల్లీ పోలీసులను కూడా కోర్టు ఆదేశించింది. దిశా రవి కేసు దర్యాప్తునకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు మీడియా సమావేశాల ద్వారా వెల్లడించవచ్చని కోర్టు పేర్కొంది. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన దర్యాప్తు సమాచారాన్ని మీడియా సంస్థలకు లీక్ చేయకుండా పోలీసులను నిలువరించాలని కోరుతూ దిశా రవి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. దిశా రవికి, మూడవ వ్యక్తులకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలతోసహా ఎటువంటి ప్రైవేట్ సంభాషణలను కాని సమాచారాన్ని కాని ప్రచురించవద్దని మీడియాను కోర్టు ఆదేశించింది.