ఓటర్లకు సువేందు పిలుపు
నందిగ్రాంలో నామినేషన్ దాఖలు
హల్దియా: బయటి వ్యక్తులకు ఓటు వేయవద్దని నందిగ్రాంలో టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ఒకప్పటి ఆమె సన్నిహిత సహచరుడు సువేందు అధికారి నియోజక వర్గ ప్రజలకు పిలుపుపిచ్చారు. తూర్పు మిడ్నపూర్ జిల్లా కాంతిలో ఓటరు అయిన అధికారి శుక్రవారం నందిగాం నియోజకవర్గంనుంచి బిజెపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నమ్మకాన్ని, ఆకాంక్షలను వమ్ము చేసి ద్రోహం చేసిన బైటివాళ్లకు వేసి మీ ఓటును వృథా చేసుకోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మమతా బెనర్జీ పేరును నేరుగా ప్రస్తావించకుండా అధికారి అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందని, పార్టీ విధాన నిర్ణయాల్లో కానీ, రాష్ట్రప్రభుత్వంలో కానీ మిగతా వారికి ఎలాంటి పాత్రా లేదని ఆయన అన్నారు. అత్త, మేనల్లుడు (మమత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ) తప్ప మిగతా అందరూ కూడా పార్టీలో లాంప్ పోస్టులు మాత్రమేనని కూడా ఆయన అన్నారు.