చలికాలంలో చలికి శరీరం బిగుసుకుపోవడం, బద్ధకం అనిపించడం సర్వసాధారణం అని చెప్పవచ్చు. అందుకే ఈ సమయంలో ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఈ సీజన్ లో వ్యాయామాలు చేయాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో మాత్రమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. తద్వారా జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండగలం. అయితే ఈ సీజన్ లో ఇంట్లోనే సులభంగా చేయగల కొన్ని వ్యాయామాలు గురుంచి చూద్దాం.
జంపింగ్ జాక్స్
జంపింగ్ జాక్స్ శరీరాన్ని తక్షణమే వేడెక్కించే గొప్ప కార్డియో వ్యాయామం. ఇలా 2-3 నిమిషాలు చేస్తే ఇది కండరాలను టోన్ చేస్తుంది. అంతేకాకుండా వాటిని చురుకుగా చేస్తుంది.జంపింగ్ జాక్స్ రక్త ప్రసరణను పెంచి, కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
స్క్వాట్స్
ఇంట్లోనే ఈజీగా చేసుకునే స్క్వాట్స్ తొడలు, తుంటి, గ్లూట్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. దీన్ని ప్రతిరోజూ 12-15 సార్లు రిపీట్ చేస్తే ఇది దిగువ శరీరాన్ని టోన్ చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.
పుష్-అప్స్
ఎగువ శరీర బలాన్ని పెంచడానికి పుష్-అప్స్ ఉత్తమ వ్యాయామం. ఇది ఛాతీ, చేతులు, భుజాలను బలపరుస్తుంది. శరీరానికి వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది. మొదటగా రోజుకి 8-10 పుష్-అప్స్ చేయండి. తర్వాత క్రమంగా సంఖ్యను పెంచండి.
ప్లాంక్ హోల్డ్
ప్లాంక్ హోల్డ్ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. మొదట ప్లాంక్ హోల్డ్ 30 సెకన్లతో ప్రారంభించండి. తర్వాత క్రమంగా 1 నిమిషానికి పెంచండి. ప్లాంక్ వ్యాయామం కోర్ కండరాలను బలపరుస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంతో పాటు చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది.
మెట్లు ఎక్కడం
ఇంట్లోనే మెట్లు ఎక్కడం, దిగడం చేయాలి. ఇది ఒక గొప్ప కార్డియో వ్యాయామం అని చెప్పవచ్చు. ఇది కాళ్ళను టోన్ చేస్తుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది రోజు 5-7 నిమిషాలు చేయాలి.
సూర్య నమస్కారం
ఈ యోగాభ్యాసం 12 దశలను కలిగి ఉంటుంది. ఇది మొత్తం శరీరాన్ని సాగదీస్తుంది. అలాగే బలోపేతం చేస్తుంది. రోజూ 5-10 ప్రదక్షిణలు సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరానికి అనువుగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అక్కడికక్కడే జాగింగ్
చలి కారణంగా బయటకు వెళ్లడం సాధ్యం కాకపోతే, ఇంట్లో అక్కడికక్కడే జాగింగ్ చేయండి. దీనిని స్టేషనరీ జాగింగ్ కూడా అంటారు. ఇలా 2-3 నిమిషాలు చేయండి. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది.