Friday, January 10, 2025

పెళ్లి చేసుకోవాలంటే ఆడ, మగ అవసరమా?

- Advertisement -
- Advertisement -

సిజెఐ చంద్రచూడ్ ప్రశ్న..
స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టులో మూడో రోజూ కొనసాగిన వాదనలు

న్యూఢిల్లీ: పెళ్లి చేసుకోవాలంటే జీవిత భాగస్వాములు లింగపరంగా రెండు వేర్వేరు జాతులకు చెందిన వారయి ఉండడం అవసరమా? అని భారత ప్రధాన నాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రశ్నించారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్లపై మూడో రోజు విచారణ సందర్భంగా ఆయన ఈ ప్రశ్న వేశారు. సిజెఐ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తున్న విషయం తెలిసిందే.

గురువారం విచారణ సందర్భంగా చంద్రచూడ్ మాట్లాడుతూ , స్వలింగ వ్యక్తుల మధ్య సంబంధం కేవలం శారీరకపరమైనది కాదని, అంతకన్నా ఎక్కువగా నిలకడ గల, భావోద్వేగపరమైన సంబంధమని మేము భావిస్తున్నామన్నారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలంటే పెళ్లియొక్క పరిణామభావాన్ని పునర్నిర్వచించాల్సిన అవరం ఉందన్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి భాగస్వాములు వేర్వేరు జాతులకు చెందినవారు (స్త్రీ, పురుషులు) అయి ఉండాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు.1954లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అమలులోకి వచ్చిందని,ఆ తర్వాత ఈ 69 ఏళ్ల కాలంలో చట్టం చెప్పుకోదగ్గ రీతిలో పరిణామం చెందిందని పేర్కొన్నారు.

పెళ్లి చేసుకోవాలనుకునే వారు తమ వ్యక్తిగత చట్టాలను పాటించకూడదని భావిస్తే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకునేందుకు అవకాశం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హోమో సెక్సువాలిటీ నేరం కాదని 2018లో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరస్పరం ఇష్టపడే స్వలింగ వయోజన వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఈ తీర్పుద్వారా గుర్తించామన్నారు. అంతేకాకుండా ఇటువంటి వారి మధ్య బంధం నిలకడగా ఉన్నట్లు కూడా గుర్తించామన్నారు.ట్రోలింగ్ జరుగుతుందనే భయం ఉన్నప్పటికీ , సార్వజనీనంగా చెల్లుబాటయ్యే సిద్ధాంతాలేవీ ఉండవన్నారు. స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు, వారి పిల్లలు గృహహింసను చూస్తున్నప్పుడు జరిగేదేమిటని ప్రశ్నించారు. అటువంటి పిల్లలు సాధారణ వాతావరణంలో పెరుగుతారా అని ప్రశ్నించారు.

మద్యానికి బానిసైన తండ్రి రోజూ తాగి వచ్చి తల్లిని కొడుతుంటే, మద్యం కోసం డబ్బులడుగుతుంటే ఆ పరిస్థితులను చూసే పిల్లలు సాధారణ వాతావరణంలోపెరుగుతారా? అని సిజెఐ ప్రశ్నించారు. స్వలింగ వివాహం చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టడం సాధ్యం కాదని న్యాయవాదులు వాదించినప్పుడు, చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ మాట్లాడుతూ, స్త్రీపురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేటి కాలంలో విద్యావ్యాప్తి జరగడంతో పాటుగా ఆధునిక కాలపు ఒత్తిళ్లు కూడా పెరిగాయని, ఫలితంగా దంపతులు పిల్లలు లేకుండానో, ఒకే బిడ్డను కనడమో చేస్తున్నారని అన్నారు. కొడుకు తప్పనిసరిగా ఉండాలనే భావంనుంచి దూరమవుతున్నారని అన్నారు.

స్వలింగ వివాహాలను అనుమతించకూడదని కేంద్రప్రభుత్వం గట్టిగా వాదిస్తున్న నేపథ్యంలో సిజెఐ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పిటిషనర్లు పట్టణ ఉన్నతవర్గాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల ఈ పిటిషన్లను తోసిపుచ్చాలని కేంద్రం కోరుతోంది. దీనిపై చర్చించేందుకు పార్లమెంటే సరైన వేదిక అని కూడా వాదిస్తోంది. చట్టసభలు విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలను కూడా స్వీకరించాలని తెలిపింది. భారతీయ కుటుంబాల్లో భర్త, భార్య, పిల్లలు ఉంటారని, అటువంటి కుటుంబంతో స్వలింగ వ్యక్తుల వివాహాన్ని పోల్చకూడదని కూడా వాదిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News