Thursday, January 23, 2025

తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్‌ను జైలుకు పంపుతారా?

- Advertisement -
- Advertisement -
ఎవరుపడితే వారు వచ్చి అడ్డంగా మాట్లాడిపోతున్నారు
కెసిఆర్‌పై ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ ఫైర్

హైదరాబాద్: తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్‌ను జైలుకు పంపుతారా అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఎవరిపడితే వారు వచ్చి అడ్డంగా మాట్లాడిపోతున్నారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌పై ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. ఉప్పల్ కూడలిలో స్కైవాక్, ఉప్పల్ భగాయత్‌లోని శిల్పారామంలో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ మంత్రి కెటిఆర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ సభలో కెసిఆర్, బిఆర్‌ఎస్‌పై నడ్డా చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ పేదలకు అండగా నిలబడి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇస్తున్నందుకా..? కెసిఆర్ కిట్లు ఇస్తున్నందుకా..? రెండు పడక గదుల ఇళ్లు ఇస్తున్నందుకు కెసిఆర్‌ను జైలుకు పంపిస్తారా అని కేంద్రాన్ని కెటిఆర్ ప్రశ్నించారు. మాట్లాడడానికి ఒక హద్దు ఉండాలని, ఈ 23 సంవత్సరాల్లో కెసిఆర్‌తో పెట్టుకున్న వారెవరు బాగుపడలేదని మంత్రి కెటిఆర్ ధ్వజమెత్తారు.

రేవంత్‌రెడ్డి మాట్లాడితే పులి శాఖాహారం గురించి మాట్లాడినట్టు…
కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యంతో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారని దానికి సోనియా గాంధీ కారణం కాదా అని కెటిఆర్ ప్రశ్నించారు. అవినీతి గురించి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడితే పులి శాఖాహారం గురించి మాట్లాడినట్లు ఉంటుందని, హంతకుడు సంతాపం తెలిపినట్లు ఉంటుందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. రూ.50 లక్షల నోట్ల కట్టలతో దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతి ముచ్చట్లను మనం వినాలా అని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ 9 సంవత్సరాల్లో ఒక్కో పని చేసుకుంటూ హైదరాబాద్, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఈ విషయాలను ప్రజలు గమనించాలని కెటిఆర్ సూచించారు.

కేంద్రం నిర్లక్ష్యం వల్ల రహదారి పూర్తి కాలేదు
వేసవి కాలంలో నీటి ఇబ్బందులు లేకుండా సిఎం కెసిఆర్ పరిష్కరించారని కెటిఆర్ పేర్కొన్నారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణం పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని, కేంద్రం నిర్లక్ష్యం వల్ల నాలుగేళ్ల నుంచి రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని కెటిఆర్ ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కరెంట్ కష్టాలు ఉన్నాయని, ప్రస్తుతం 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.

ఎయిర్‌పోర్టు మెట్రోను రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తాం
ఎయిర్‌పోర్టు మెట్రోను రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఉప్పల్ కూడలిలో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులకు గురికావద్దని స్కైవాక్ నిర్మించామని ఆయన వివరించారు. ఈ స్కైవాక్‌లో ఆరు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో నీటి వసతి కోసం రూ.450 కోట్లతో ట్యాంక్‌లను నిర్మించినట్లు కెటిఆర్ వివరించారు. ఎస్‌ఎన్‌డిపి పనులను పూర్తి చేశామని, కరోనా సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఉప్పల్‌లో ఐదు పారిశ్రామిక వాడలున్నాయని గతంలో కరెంట్ లేక పరిశ్రమలు నడవని పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో ఈ స్కైవాక్‌ను ప్రారంభించడం వల్ల పాదాచారులకు ఇబ్బందులు తప్పాయని మంత్రి కెటిఆర్ తెలిపారు.

ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా…
ప్రజల ఇబ్బందులను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూ.36.50 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండిఏ దీనిని నిర్మించింది. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా అటు నుంచి ఇటు వైపు ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ ఈ స్కైవాక్‌ను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్లు,4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్‌ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్‌ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్‌ఎంసి మాజీ మేయర్ బొంతు రాంమోహన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News