సాగుకు 3గంటల కరెంటు చాలంటున్న పిసిసి సారథి
మన తెలంగాణ/హైదరాబాద్: మీటర్లు పెట్టాలని కేంద్రం బెదిరిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కరెంట్‌పై కాంగ్రెస్ విధానం ఏంటో రాహుల్ స్పష్టం చేయాలన్నారు. 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మన రాష్ట్రంలో వరి ఉత్పత్తి భారీగా పెరిగిందన్నారు. అందుకే తెలంగాణ రైతు కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? ఆలోచించుకోవాలన్నారు. కేంద్రం మెడలు వంచి కెసిఆర్ ప్రాజెక్టులు కడుతున్నారన్నారు. మేమంతా రైతుల కోసమే పని చేస్తున్నామని, రైతుల భూముల రక్షణ కోసం ధరణి తీసుకు వచ్చామన్నారు. రైతు బీమా, రైతు బంధు తెచ్చామని, ప్రతి ఊళ్లో ప్రతి గింజను రైతు నుం చి కొంటున్నామన్నారు. ఆగమైనపోయిన రైతు బాగుండాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు.
బిఆర్‌ఎస్ అంటే పంట కోతలు, కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని అన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ అన్న కాంగ్రెస్ పార్టీని ఊరి పొలిమేరల వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు పొరపాటున అధికారం ఇస్తే ఆగం కావడం ఖాయమన్నారు. రైతులకు విద్యుత్‌పై ఇష్టారీతిన మాట్లాడిన రేవంత్ రెడ్డి బాహాటంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు ఉండేవని విమర్శించారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ప్రజలు స్పష్టంగా వినాలన్నారు. అమెరికాలో మూడు గంటల విద్యుత్ చాలని రేవంత్ చెప్పారని, సరే అక్కడ ఏదో చెప్పారని ఊరుకున్నా ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒకరు మూడు గంటలు అంటే మరొకరు ఐదు గంటలు అంటారని, తొలుత వారికి స్పష్టత రావాలన్నారు. ఏడాదికి 11 వేల కోట్లను ఉచిత విద్యుత్ కోసం ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రైతులపై కాంగ్రెస్‌కు ఎందు కంత కక్ష అని ఎద్దేవా చేశారు. 70 లక్షల మంది రైతులను బిచ్చగాళ్లని రేవంత్ రెడ్డి అన్నారని, కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా? అనేది రైతులు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో బావి వద్ద నిద్రపోయిన రోజులను రైతులు గుర్తుచేసుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాల నలో కోతలు లేని విద్యుత్ సరఫరా వుండేదా? అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంట్ ఎందుకని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు బాగుపడుతున్నారని, కాంగ్రెస్ నేతల తీరుతో రైతులు తిరిగి ఆగమవుతున్నారని పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే రూ.30 వేల కోట్లు వదులుకున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను మించి తెలంగాణ అగ్రస్థానంలో వుందని మంత్రి కెటిఆర్ తెలిపారు.