జగిత్యాల : వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతి ఎకరానికి సాగు నీరందించి ఏడాదిలో మూడు పంటలు పండించాలనే నినాదంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే, ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్‌రెడ్డి రోజుకు మూడు గంటల కరెంట్ చాలంటూ మాట్లాడుతున్నాడని, ఈ నేపథ్యంలో మూడు పంటలు కావాలా… మూడు గంటల కరెంట్ కావాల్లో తేల్చాల్సిన సమయం ఆసన్నమైందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు.
బిఆర్‌ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కెటిఆర్ ఆదేశాల మేరకు సోమవారం జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ రైతు వేదిక వద్ద రైతులతో సమావేశమై కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తీర్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి మాటల తీరుపై ప్రతి గ్రామంలో చర్చ జరగాలని, రైతును ఆగం చేసేందుకు కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ పార్టీ నేతల ఆటలు కట్టించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు.
గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అంటూ రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశాయన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చాలని సిఎం కెసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా పథకాలు తీసుకొచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్ కోసం వ్యవసాయ బావుల వద్ద రైతుల పడిగాపులు లేవని, ఎండిన పంటలు, సబ్ స్టేషన్‌ల ఎదుట కరెంట్ కోసం ఆందోళనలు లేకుండా పోయాయన్నారు.
ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. చల్‌గల్ క్లస్టర్ పరిధిలో 58 మంది రైతులు మరణిస్తే రూ.2.90 కోట్ల బీమా పరిహారం అందించామన్నారు. రైతు బంధు పథకం ద్వారా 6 విడతల్లో రూ. 34.85 కోట్ల పెట్టుబడి సాయం అందించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో… ఎప్పుడు పోతుందో తెలియక రైతన్నలు వ్యవసాయ బావుల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చేదన్నారు.
చీకట్లో బావుల వద్దకు వెళ్లిన రైతులు పాము కాటుకు, విద్యుత్ షాక్‌లకు గురై ఎంతో మంది మరణించిన సంఘటనలున్నాయన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో గతంలో 23 వేల ఎకరాల్లో పంటలు సాగు కాగా తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి సమస్యలను దూరం చేయడంతో నేడు 66 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయన్నారు. రోజుకు మూడు గంటల కరెంట్ చాలంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటల వెనుక ఏదో మర్మం దాగి ఉందని, రైతులందరూ చైతన్యం కావాల్సిన అవసరముందన్నారు.
రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి రైతు వేదిక వద్ద రైతులతో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి చైర్‌పర్సన్ దావ వసంత, ఎంపిపి పాలెపు రాజేంద్రప్రసాద్, ఎఎంసి చైర్మన్ నక్కల రాధ, ఫ్యాక్స్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్‌రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ ఆసీఫ్, బాల ముకుందం, ఎంపిటిసిలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.