జైపూర్: పట్టపగలు నడిరోడ్డుపై వైద్యుడి, అతడి భార్యను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లాలో జరిగింది. ఘటనా స్థలంలోనే దంపతులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుదీప్ గుప్తా అనే వ్యక్తి వైద్యుడిగా పని చేస్తున్నాడు. తన భార్య సీమా గుప్తాతో కలిసి కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కారును అడ్డగించారు. వెంటనే దుండగులు బైక్ పై నుంచి దిగి వారిపై నాలుగు ఐదు రౌండ్లు తుపాకీతో కాల్పులు జరపడంతో ఘటనా స్థలంలోనే వారు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిసి కెమెరా ఆధారంగా నిందితులు అనూజ్, మహేష్ గా గుర్తించారు. గతంలో డాక్టర్ సుదీప్ ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. మహిళతో మనస్పర్థలు రావడతో ఆమె తన ఐదేళ్ల బిడ్డతో ఇంట్లో ఉన్నప్పుడు సుదీప్ నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో తల్లి, బిడ్డ సజీవదహనమయ్యారు. ఇది అగ్ని ప్రమాదం కాదని హత్యేనని పోలీసులు కేసు నమోదు చేసి సుదీప్, అతడి భార్య, అతడి తల్లిని జైలుకు తరలించారు. తన అక్క, ఆమె బిడ్డను సుదీప్ హత్య చేశాడని అతడిపై ఆమె సోదరుడు అనూజ్ పగపెంచుకున్నాడు. సుదీప్ హత్య చేశాయని సరైన సమయం కోసం ప్రణాళికలు వేస్తున్నాడు. దంపతులు జైలు నుంచి విడుదలైన తరువాత సుదీప్ తన భార్యతో కలిసి కారులో వెళ్తుండగా అనూజ్ తన స్నేహితుడు మహేష్ సహాయంతో కారుకు అడ్డంగా బైక్ ను నిలిపారు. అనంతరం తుపాకీతో వారిపై కాల్పులు జరపడంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. స్థానిక ఐజి ప్రశాంత్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని సిసి కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రతీకారంతో హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో రాజస్థాన్ రాష్ట్రం నేరగాళ్ల రాజ్యంగా మారిందని బిజెపి నేత రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తన ట్విట్టర్ లో ఘాటు విమర్శలు చేశాడు.
.