Sunday, January 19, 2025

యువకులతో వైద్యుడు హోమోసెక్స్..

- Advertisement -
- Advertisement -

గోషామహల్: సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ పేద యువకులను టార్గెట్ చేసి, మొబైల్ ఫోన్‌లు, ల్యాప్ టాప్‌లను గిఫ్డ్‌లుగా ఇచ్చి, వారిని లోబర్చుకుని హోమో సెక్స్‌కు పాల్పడుతున్న వైద్యుడు జవ్వాద్ అలీ ఖాజా లైసెన్స్‌ను రద్దు చేసి, చట్టపరంగా కఠినంగా శిక్షించి, తనకు న్యాయం చేయాలని వైద్యుడి భార్య అంజుమ్ బేగం ప్రభుత్వాన్ని వేడుకుంది. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజుమ్ బేగం, ఆమె సోదరుడు రహమతుల్లా, తల్లి నజ్మాతో కలిసి మాట్లాడారు. మౌలాలి ఇందిరానగర్‌కు చెందిన అంజుమ్ బేగంకు 2014లో మౌలాలి హెచ్‌బి కాలనీకి చెందిన ఫల్మనాలజీ వైద్యుడు జవ్వాద్ అలీ ఖాజాతో వివాహం జరిగిందని తెలిపారు. తమకు ఒక పాప, ఒక బాబు సంతానం ఉన్నారని పేర్కొన్నారు.

వివాహ సమయంలో తన తల్లిదండ్రులు 30 తులాల బంగారంతో పాటు రూ. 25 లక్షల నగదును జవ్వాద్‌కు కట్నంగా ఇచ్చారని తెలిపారు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని చెప్పి అత్తింటివారు తనను తీవ్రంగా వేధించి, అనేక చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. అయినప్పటికీ తన వైవాహిక జీవితం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎంతగా వేధించినా మౌనంగా భరించానని అంజుమ్ బేగం విలపించారు. 2023 ఫిబ్రవరి 20న తన భర్త డాక్టర్ జవ్వాద్ అలీ ఖాజా ఇంట్లో ఉన్న సిసి కెమెరాలను ఆపేసి, ఇంట్లోంచి పారిపోయాడని, దీంతో తన భర్త కోసం వెతికి వెతికి వేశారి పోయానని అన్నారు. రామోజీ ఫిలిం సిటీ సమీపంలో గల కాలేజీలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించే విష్ణువర్దన్ రెడ్డి అనే యువకుడు తమ ఇంటిపై అద్దెకు ఉండేవాడని, తన భర్త గురించి అతనిని అడిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు.

తన భర్త గురించి విష్ణువర్దన్ రెడ్డిని ఆరా తీసిన గంటలోగా తమ ఇంటిపై అద్దెకు ఉంటున్న గదిలో విష్ణువర్దన్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు డాక్టర్ జవ్వాద్ అలీ ఖాజా తనను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. తన భార్య అంజుమ్ బేగంకు విడాకులు ఇచ్చి, చట్టబద్ధంగా విష్ణువర్దన్ రెడ్డిని పెళ్లి చేసుకోవడంతో పాటు తన ఆస్తులను ఇస్తానని డాక్టర్ జవ్వాద్ అలీ ఖాజా లేఖ రాసినట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ విషయమై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు, రాజకీయ నేతలతో గల పరిచయాలతో డాక్టర్ జవ్వాద్ పోలీసులతో కుమ్మక్కై, కేసును తనకు అనుకూలంగా మల్చుకున్నాడని ఆరోపించారు. ఇంటి నుంచి పారిపోయిన తన భర్త డాక్టర్ జవ్వాద్ గురించి, తాను, తన కుటుంబ సభ్యులం కలిసి రెండు నెలలపాటు వెతకగా, చివరకు హర్యానాలో గల యమునానగర్‌లో గాబా హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తూ, అక్కడ కూడా ఓ యువకుడితో హోమోసెక్స్‌కు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

పేద యువకులను టార్గెట్ చేసి, మాయ మాటలతో లోబర్చుకుని వారితో హోమో సెక్స్‌కు పాల్పడుతున్న డాక్టర్ జవ్వాద్‌ను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ హోమో సెక్స్‌కు పాల్పడి, ఓ ఇంజనీరింగ్ యువకుడి ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ జవ్వాద్ అలీ ఖాజా డాక్ట్టర్ లైసెన్స్‌ను రద్దు చేసి, చట్టరీత్యా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో డాక్టర్ జవ్వాద్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, కఠినంగా శిక్షించడంతో పాటు తన భర్త ఆస్తులపై తనకు, తన పిల్లలకు హక్కులు కల్పించి, న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించి తమకు న్యాయం చేస్తుందన్న భరోసా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News