గోదావరిఖని: పురిటి నొప్పులతో వచ్చి సర్జరీ చేయించుకున్న మహిళ కడుపులో ఓ సీనియర్ వైద్యురాలు కత్తెర మరిచారు. ఈ సంఘటన గోదావరిఖనిలో చోటు చేసుకుంది. పట్టణంలోని మార్కండేయ కాలనీలో గల జెమిని ఆసుపత్రి నిర్వహిస్తున్న సీనియర్ వైద్యురాలు తన వద్దకు గతంలో ఓ మహిళ పురిటి నొప్పులతో వచ్చి సర్జరీ చేయించుకొని బిడ్డతో సంతోషంగా వెళ్లారు. ఆ తరువాత ఆ మహిళకు అసలు సమస్య మూడు నెలల తరువాత మొదలైంది. కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో ఆపరేషన్ చేసిన ఆ సీనియర్ వైద్యురాలు దగ్గరకు వెళ్లి విషయం చెప్పుకోగా అంతా బాగానే ఉందని మందులు ఇచ్చి పంపారు.
అయినప్పటికీ కడుపులో నొప్పి తగ్గకపోవడంతో ఆ మహిళ కుటుంబం ఆమెతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షల రూపాయలను ఖర్చు పెట్టుకున్నారు. చివరకు హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో వైద్యం కోసం స్కానింగ్ పరీక్షలు చేసుకోగా అసలు విషయం బయట బడింది. స్కానింగ్‌లో ఆ మహిళ కడుపులో ఆపరేషన్ కోసం వాడిన కత్తెర ఉన్నట్లుగా స్కానింగ్‌లో తెలిసింది.
వైద్యురాలిపై కేసు నమోదు చేసి, ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలి
మహిళ కడుపులో కత్తెర మరిచి నరకయాతనకు కారణమైన వైద్యురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఆసుపత్రి లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి, సీజ్ చేయాలని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. వైద్యురాలిపై జిల్లా రాష్ట్ర వైద్య సంచాలకులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిర్లక్ష వైద్యం చేస్తున్న ఆసుపత్రులను సీజ్ చేయకుంటే ఇక ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.