Saturday, November 23, 2024

డాక్టర్ నిర్లక్ష్యం: ఎడమ కాలికి బదులు కుడి కాలుకు ఆపరేషన్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ : రోగికి ఎడమ కాలికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా కుడి కాలికి చేసి, ఈ తప్పిదాన్ని రెండు రోజుల అనంతరం గుర్తించి తిరిగి ఎడమ కాలికి ఆపరేషన్ చేసిన ఆర్థోపెడిక్ సర్జన్ డా.కరణ్  ఎం.పటేల్ వైద్య విద్య పట్టాను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేసిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021 జులై 15న జిల్లాలోని మూడు చింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామానికి చెందిన జి.సురేష్ చారి ఎడమకాలికి ఆపరేషన్ అవసరమై ఇసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.

అన్ని పరీక్షల అనంతరం మరుసటి రోజు సురేష్ చారిని ఆపరేషన్ ధియేటర్‌కు తీసుకెళ్లి పొరపాటున ఎడమ కాలికి చేయాల్సిన ఆపరేషన్ కుడికాలికి చేశారు. రెండు రోజుల తర్వాత పొరపాటును గ్రహించి తిరిగి ఎడమ కాలికి ఆపరేషన్ చేసి తప్పును సరిదిద్దుకున్నారు. ఈ విషయంపై బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమగ్ర విచారణ జరిపి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌కు నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా మెడికల్ కౌన్సిల్ విచారణ జరిపి నిర్లక్షంగా వ్యవహరించిన డా.కరణ్ ఎం. పటేల్ డిగ్రీని ఆరు నెలల నాటు సస్పెండ్ చేసింది.

ఈ మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఛైర్మెన్ డా.రాజలింగం ఉత్తర్వులు జారీ చేశారు. డా.కరణ్ ఎం. పటేల్ తన డిగ్రీ సర్టిఫికెట్స్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు సమర్పించాలని, ఆరు నెలల పాటు ఎలాంటి చికిత్సలు చేయరాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. జిల్లాలో అర్హత లేని వైద్యులు తప్పుడు డిగ్రీలతో ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డా.పుట్ల శ్రీనివాస్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News