ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ విధులకు వెళ్లకుండానే లక్షలాది రూపాయలు జీతంగా పొందుతున్నాడు. వైద్య కళాశాలలో విద్యను అందించాల్సిన సదరు ప్రొఫెసర్ జనగామ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తంబ్ వేసి విధులకు వెళ్లకుండా నర్సంపేటలోని తన సొంత మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. నర్సంపేటలోని ఓ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకుడు జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గత కొన్నేళ్లుగా ఆర్థోపెడిక్ విభాగానికి ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రతి రోజు నర్సంపేట నుంచి జనగామకు వెళ్లి విధులు నిర్వర్తించి సాయంత్రం తిరిగి నర్సంపేట వచ్చి తన ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యం చేసేవాడు. వైద్య విద్యా శాఖలోని లోపాలను ఆసరాగా చేసుకున్న ఈ ప్రొఫెసర్ ఉద్యోగానికి వెళ్లకుండానే జీతం ఎలా పొందాలో ఆలోచించాడు.
ఆలోచన వచ్చిందే తడవుగా నర్సంపేటలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తంబ్ ఇంప్రెషన్ వద్దకు వెళ్లి తంబ్ వేయడం ప్రారంభించాడు. గత అక్టోబర్ నెలాఖరులో తంబ్ వేస్తుండగా గత నెల 22న ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. నర్సంపేట మెడికల్ కళాశాలలో ఉద్యోగం చేయని ఈ ప్రొఫెసర్ ఇక్కడ ఎందుకు తంబ్ వేస్తున్నట్లు అని ఆరా తీసి నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. ఈమేరకు నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నర్సంపేటలోని తన సొంత ఆసుపత్రిని చక్కదిద్దుకునే పనిలో భాగంగానే ఈ ప్రొఫెసర్ కొన్నిరోజుల నుంచి విధులకు వెళ్లకుండా ఇక్కడే తంబ్ వేసి ఉద్యోగానికి వెళ్లకుండానే ఎంచక్కా లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేస్తుండడంతో పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో పనిచేసే ప్రొఫెసర్లు ఎక్కడ నుంచి అయినా తంబ్ వేసినా హాజరైనట్లు చూపించడాన్ని ఆసరాగా తీసుకున్న ఈ డాక్టర్ గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారానికి ఒడిగడుతున్నట్లు తెలిసింది.
ఇదిలాఉండగా ప్రొఫెసర్ విధులకు రాకపోవడాన్ని జనగామ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గుర్తించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాస్‌ను వివరణ కోరగా.. నర్సంపేట ప్రభుత్వాసుపత్రిలో జనగామ జిల్లా మెడికల్ కళాశాల ప్రొఫెసర్ తంబ్ వేసింది నిజమేనని, తన దృష్టికి వచ్చిన వెంటనే సిసి ఫుటేజీని పరిశీలించి జనగామ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్‌రావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.