Thursday, January 23, 2025

డా. ప్రీతి విషాదం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: వరంగల్ కాకతీయ వైద్య కళాశాలకు చెందిన పిజి విద్యార్థి డా. ప్రీతి దుర్మరణం ఘోర విషాద అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. వైద్య విద్యలో ఉన్నత శిఖరాలను అందుకొని సమాజానికి సమున్నత సేవలందించాలని కలలు గనడమేగాక ఆ లక్షానికి అతి చేరువలో వున్న దశలో ఆమె బతుకు ఇలా అంతమైపోతుందని ఎవరూ ఊహించి వుండరు. విద్యార్జన క్రమంలో సీనియర్ రూపంలో ఎదురైన మృత్యువు ఆమెను ఇలా కబళిస్తుందని అనుకొని వుండరు. సామాజిక నేపథ్య పరంగా చదువులతో తమకున్న దూరాన్ని సునాయాసంగా జయించిన ప్రీతి నాగరక సమాజం పన్నిన ర్యాగింగ్ ఉచ్చు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది.

డా. ప్రీతిని ఆమె సీనియర్ సైఫ్ చెప్పనలవికాని న్యూనతకు గురి చేశాడని దానిని తట్టుకోలేకనే ఆమె ప్రాణాంతకమైన ఇంజెక్షన్ తీసుకున్నదని వార్తలు చెబుతున్నాయి. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తర్వాత ఆదివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్‌లో ఆమె ప్రాణం విడిచారు. తమ కుటుంబంలో ఉజ్వలంగా ప్రకాశించిన జ్ఞాన దీపం ఉన్నట్టుండి ఇలా వేధింపుకి గురై ఆరిపోడం ఆమె తలిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను ఎంతగా బాధించి వుంటుందో! వైద్య విద్యలో సీనియర్లకు జూనియర్లు, ప్రొఫెసర్లకు విద్యార్థులు తూనీగల్లా చేతికి చిక్కుతారని వారు ఒక్కొక్క రెక్క చించి, చిదిమి పెడుతుంటే ఆ బాధలను తట్టుకోడం వీరికి సులభం కాదని పదేపదే రుజువవుతూనే వున్నది. ర్యాగింగ్ అనే ముద్దు పేరుతో ఏటా వైద్య కళాశాలల్లో, ఆ పరిసరాల్లో, హాస్టళ్ళల్లో, ఇతర వసతుల్లో ఈ దుర్మార్గం సృష్టించే బీభత్సం ఇంత అంత కాదు. ర్యాగింగ్‌కు భయపడి జూనియర్ విద్యార్థులు నెలల తరబడి క్లాసులకు దూరంగా వుండడం కొత్త కాదు. వీరి బాధ తలిదండ్రులకు తెలిసినా ఆదుకోడం సాధ్యం కాక మౌన వేదన అనుభవిస్తూ వుంటారు. ర్యాగింగ్ వ్యతిరేక చట్టం వున్నప్పటికీ అది అమలైన ఉదాహరణలు బహు తక్కువ. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే కాదు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా దీనిని అరికట్టడం ఆయా యాజమాన్యాలకు సాధ్యం కావడం లేదు. గత ఐదేళ్లలో ర్యాగింగ్‌ను ఎదుర్కోలేక దేశ వ్యాప్తంగా 119 మంది మెడికోలు ఆత్మహత్య చేసుకొన్నారని జాతీయ వైద్య మండలి తాజాగా ప్రకటించింది.

వీరిలో 64 మంది అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు కాగా, మిగతా 55 మంది పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులని తెలియజేసింది. అలాగే గత ఐదేళ్ళ వ్యవధిలో 1166 మంది మెడికల్ విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసి వెళ్ళిపోయారని తెలుస్తున్నది. ప్రీతి చివరిసారిగా తన తల్లితో మాట్లాడిన సంభాషణను గమనిస్తే సైఫ్ వేధింపును ఆమె ధైర్యంగానే ఎదుర్కోడానికి ప్రయత్నించినట్టు బోధపడుతున్నది. తనకు ఫిర్యాదు చేయకుండా ప్రిన్స్‌పాల్ వద్దకు ఎందుకు వెళ్ళావని హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ (హెచ్‌ఒడి) ఆమెను తీవ్రంగా ప్రశ్నించినట్టు ఆ సంభాషణ తెలియజేస్తున్నది. సైఫ్‌ను కూడా పిలిపించి హెచ్‌ఒడి మాట్లాడాడని దానితో అంతా ఆగిపోతుందని డా. ప్రీతి ఆశించారని ఆ సంభాషణ వెల్లడిజేస్తున్నది. సైఫ్ అందరినీ వేధిస్తున్నాడని, ఎవరూ బయటపడడం లేదని ఆమె తల్లితో చెప్పుకొన్నట్టు రూఢి అవుతున్నది. వాడిని సస్పెండ్ చేయొచ్చుకదా అని తల్లి అడిగినప్పుడు అంత అవసరం లేదని ఆమె బదులిచ్చారంటే అప్పటి వరకు ఎంత ధైర్యంగా వున్నారో అర్థమవుతుంది.

సీనియర్లు జూనియర్ల బతుకులతో ఆడే చెలగాటం ఇలా వుండగా, పరీక్షల సమయంలో ముఖ్యంగా ప్రాక్టికల్స్ విషయంలో మెడిసిన్ విద్యార్థులతో ప్రత్యేకించి విద్యార్థినులతో ప్రొఫెసర్లు ఎంత క్రూరంగా వ్యవహరిస్తారో తెలిసిందే. గతంలో ఇందుకు సంబంధించిన ఉదంతాలు కొన్ని బయటపడ్డాయి. 2019 ఏప్రిల్‌లో ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన ఒక ప్రొఫెసర్‌ని అవినీతి నిరోధక విభాగం అరెస్టు చేసింది. జనరల్ మెడిసిన్ బోధించిన ఆ ప్రొఫెసర్ పరీక్ష పాస్ చేయించడానికి తన విద్యార్థుల నుంచి లంచం వసూలు చేసినట్టు ఆధారాలు లభించడంతో ఈ అరెస్టు జరిగింది. ఆయన ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. విద్యార్థినుల విషయంలోనైతే ఈ డిమాండ్లు మరింత ఘోరంగా వుండేవి.

ఇవి ఇప్పటికీ కొనసాగుతూనే వుండొచ్చు. ఉన్నపళంగా మరో అగ్నిపర్వతమేదో బద్దలైతే గాని వాటి వికృత లక్షణం వెల్లడి కాదు. వైజ్ఞానికంగా ఎంత ముందుకు వెళుతున్నా మనిషి అమానుష శిఖరాలు అందుకుంటూనే వున్నాడు. ఎవరు ఎంతగా వేధించినా, న్యూనంగా చూసినా తమను ఏమీ చేయలేరని, చట్టమే కాదు, సమాజం కూడా తమ వెంట గట్టి దన్నుగా వుందని గ్రహించి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోడాన్ని విద్యార్థినులు అలవర్చుకోవాలి. ఆడ పిల్లను పెంచే తీరులో అటువంటి ధైర్యాన్ని వారికి కలిగించడాన్ని తమ గురుతర బాధ్యతగా తలిదండ్రులు స్వీకరించాలి. డా. ప్రీతి ఉదంతంలో లోతైన దర్యాప్తు జరగాలి. వాస్తవాలు పూర్తిగా బయటకు రావాలి. ఆమె విషాదాంతానికి కారకులైన వారికి తగిన కఠిన శిక్షలు వీలైనంత త్వరగా పడినప్పుడే అటువంటి మరెంతో మందికి కీడు తప్పుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News