న్యూస్ డెస్క్: గుండెకు ఆపరేషన్ చేసిన వైద్యులు లోపల కత్తెర మరచిపోవడంతో రోగి మరణించాడని ఆ రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఫోర్టీస్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆపరేషన్ తర్వాత రోగి ఆరోగ్యం క్షీణించిడం మొదలైందని, 12 రోజుల తర్వాత రోగి మరణించాడని అతని బంధువులు చెబుతున్నారు. రోగి మృతదేహానికి అంత్యక్రయలు జరిగిన మరుసటి రోజు అస్థికల కోసం బంధువులు స్మశానానికి వెళ్లగా అక్కడ ఆపరేషన్‌కు ఉపయోగించే కత్తెర లభించిందని వారు చెప్పారు.
అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం ఇవి నిరాధార ఆరోపణలని, అటువంటిదేదీ జరగలేదని వాదిస్తున్నారు. మృతుడి బంధువులు జైపూర్‌లోని జవహర్ సర్కిల్ పోలీసు స్టేషన్‌లో ఫోర్టీస్ ఆసుపత్రి వైద్యులపై ఫిర్యాదు చేశారు. జైపూర్‌లోని మానసరోవర్ ప్రాంతానికి చెందిన 74 ఏళ్ల ఉపేంద్ర శర్మ కుమారుడు కమల్ తన తండ్రి మరణానికి కారణమైన వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేఅనారోగ్యంతో ఉన్న తన తండ్రిని 29న ఫోర్టీస్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కమల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 30న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన తండ్రిని ఆపరేషన్ కోసం తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. తెల్లవారుజామున 1.30 ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తెచ్చారని, మే 31న తన తండ్రిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని కమల్ వివరించారు.
ఇంటికి తెచ్చిన తర్వాత రెండు రోజుల నుంచి తన తండ్రి ఆరోగ్యం క్షీణించడం మొదలైందని, డాక్టర్లతో మాట్లాడితే కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారని ఆయన తెలిపారు. జూన్ 12న ఆరోగ్యం పూర్తిగా క్షీణించి రాత్రి 8.30 గంటలకుతన తండ్రి మరణించాడని ఆయన చెప్పారు. మరుసటి రోజున మహారాణి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిగాయని, జూన్ 15న అస్థికల కోసం అక్కడకు వెళ్లి చూడగా కత్తెర కనిపించిందని కమల్ తెలిపారు.
కాగా..ఈ ఆరోపణలను ఫోర్టీస్ ఆసుపత్రి జోనల్ డైరెక్టర్ నీరవ్ బన్సల్ ఖండించారు. ఇవి తప్పుడు, నిరాధార ఆరోపణలని ఆయన చెప్పారు. తమ వద్ద సర్జరీ అనంతరం తీసిన ఎక్స్‌రేలతో సహా అన్ని నివేదికలు ఉన్నాయని, కత్తెరలాంటి వస్తువేదీ రోగి శరీరంలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా..రాష్ట్ర ఆరోగ్య మంత్రి పరసది లాల్ మీనా ఆదేశాల మేరకు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు ఒక త్రిసభ్య కమిటీని నియమించారు. మూడు రోజుల్లో కమిటీ తన నివేదికను అందచేస్తుంది.