Friday, January 24, 2025

మంచు కొండల్లో గర్భిణి ప్రసవ వేదన.. వాట్సాప్ వీడియో కాల్ సాయంతో సుఖ ప్రసవం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : మంచు కొండల్లోని మారుమూల ప్రాంతంలో భారీగా మంచు కురుస్తుండగా పురిటి నొప్పులు పడుతున్న ఓ నిండు గర్భిణికి వైద్యులు వాట్సాప్ వీడియో కాల్ ఉపయోగించి సుఖప్రసవం జరిగేలా చూశారు. జమ్ముకశ్మీర్‌లో మారు మూల గ్రామమైన కేరణ్ లో ఈ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు ఆమెను శుక్రవారం రాత్రి కేరణ్ లోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఆమెకు గతంలో ప్రసవ సంబంధిత సమస్యలు ఎదురయ్యాయని డాక్టర్ మీర్ మొహమ్మద్ షఫీ చెప్పారు. . దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసూతి సౌకర్యాలున్న వేరే ఆస్పత్రికి తరలించడానికి ఎయిర్ లిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. కానీ గురు, శుక్రవారాల్లో మంచు దట్టంగా కురుస్తుండడంతో వాతావరణం సహకరించలేదు.

కుప్వారా జిల్లా లోని మిగతా ప్రాంతాలతో కేరణ్‌కు సంబంధాలు తెగిపోయాయి. నిరంతరాయంగా మంచుకురుస్తుండడంతో అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పీహెచ్‌సి వైద్య సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు. క్రాల్ పోరా సబ్ డిస్ట్రిక్టు ఆస్పత్రి లోని గైనకాలజిస్ట్ డాక్టర్ పర్వైజ్‌ను సంప్రదించారు. వాట్సాప్ కాల్ ద్వారా ఆయన పిహెచ్‌సి లోని డాక్టర్ ఆర్షద్ సోఫీ , పారామెడికల్ సిబ్బందికి ప్రసవ ప్రక్రియపై మార్గనిర్దేశం చేశారు. దాదాపు ఆరుగంటల ప్రసవ వేదన అనంతరం ఆమె ఒక పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, వారిని పరిశీలనలో ఉంచినట్టు క్రాల్‌పోరా బ్లాక్ వైద్యాధికారి డాక్టర్ మీర్ మహ్మద్ షఫీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News