Wednesday, January 22, 2025

దైవానికి ప్రతిరూపం వైద్యులు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: వైద్య విద్యార్థులు దైవానికి ప్రతిరూపం అని, సేవా దృక్పథంతో పనిచేయాలని, ప్రతి వైద్య విద్యార్థి గ్రామీణ ప్రాంతంలో కనీస సేవలు అందించేలా లక్ష్యంగా తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి మెడికల్ కళాశాల మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసుకున్నామని ప్రశంసించారు. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం నాలుగు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవని, 70 ఏళ్లలో మన రాష్ట్రానికి ఒకే ఒక మెడికల్ కళాశాల వచ్చిందని, తెలంగాణ వచ్చిన తర్వాత మొట్ట మొదటి కళాశాల మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసుకున్నామన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్ల వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

మెడికల్ కళాశాలకు మంజూరు కాకముందే స్థలాన్ని గుర్తించి సిద్ధంగా ఉంచుకున్నామని, ఎనో వ్యయ ప్రయాసాలు పడి మెడికల్ కళాశాలను మంజూరు చేసుకోవడంతో పాటు రెండేళ్లలోనే పూర్తి చేసుకున్నామని, మూడో సంవత్సరం నుంచి పిజి సీట్లు కూడా తెచ్చుకున్నామని మంత్రి కొనియాడారు. ఉస్మానియా, గాంధీ తర్వాత రాష్ట్రంలో మంచి పేరున్న మెడికల్ కళాశాల మహబూబ్ నగర్ అని తెలిపారు. తెలంగాణ ప్రతి సంవత్సరం రెండున్నర వేల నుండి 3000 మంది మెడికల్ విద్యార్థులను, 1400 మంది పిజి డాక్టర్లను తయారు చేస్తున్నామని చెప్పారు. 170 మంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లను దేశానికి అందిస్తున్నామని, దేశానికి సరిపడే సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మన రాష్ట్రం నుండి వెళ్తున్నారని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లాకు గతంలో నర్సింగ్ కళాశాల మంజూరు కాగా, కొత్తగా డెంటల్ కళాశాల కూడా రానుందని ఆయన అన్నారు. ఇతరులకు సేవను అందించడంలో మదర్ థెరిసా, డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించే ధ్యేయంతో చదువుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలను వెచ్చించి వైద్య విద్య అందిస్తున్నదని, అందువల్ల సమాజానికి కూడా సేవ చేయాలన్న తలంపుతో విద్యార్థులు మెడికల్ విద్యనభ్యసించాలని కోరారు. పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని, నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని, అక్కడ అన్ని రకాల సదుపాయాలతో పాటు, క్వార్టర్స్ కూడా నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో డాక్టర్ల జీతాలు పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి సిఫారసు చేసిన మంత్రులతో తాను కూడా ఒకడిని తెలిపారు.

దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రామ్ కిషన్, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, డాక్టర్ శామ్యూల్, డాక్టర్ రామ్మోహన్, వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కిరణ్, నవకల్యాణి, సునంద, వైద్య కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షులు రిషికేష్ ,రమ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News