Monday, December 23, 2024

బాబుకు తీవ్రమైన అనారోగ్యం

- Advertisement -
- Advertisement -

తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్నట్లు వెల్లడి
శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలర్జీ ఉన్నట్లు నిర్దారణ
తీవ్రమైన ఎండల కారణంగా డీ హైడ్రేషన్‌తో చంద్రబాబు ఇబ్బంది
ఆయన వ్యక్తిగత వైద్యులు సూచిస్తే అవసరమైన పరీక్షలు చేస్తాం: జైళ్ల డిజిపి రవికిరణ్

మన తెలంగాణ/ హైదరాబాద్: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కీలక నివేదిక ఇచ్చారు. ఆయన ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు మెడికల్ రిపోర్టులో వెల్లడించారు. మెడికల్ రిపోర్టును బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చినట్లు సమాచారం. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఉన్నట్లుగా తెలిసింది. చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్టు నిర్ధారణ అయింది. గడ్డం మీద, అరచేతిభాగాల్లో, ఛాతి భాగంలో, శరీరంలోని పలు భాగాల్లో హెరిటమతాస్ దద్దుర్లు, చర్మం రంగు మారినట్లుగా వైద్యుల నివేదికలో తేలింది. కలామన్ లోషన్, అరచేతుల కోసం మార్చురెక్స్ సాఫ్ట్ క్రీమ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం మెకనాజల్ వైద్యులు రిఫర్ చేశారు. అలెర్జీ కోసం టెక్జిన్, ఇమ్యూనిటీ పెంపు కోసం లిమ్సీ ట్యాబ్లెట్స్ రిఫర్ చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డీహైడ్రేషన్‌తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం వైద్యులు తేల్చారు.

డీహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని నివేదికలో స్పష్టంగా సూచించారు. చంద్రబాబుకు హైపర్ ట్రోఫీక్ కార్డియో మైయోపతి సమస్య ఉందని వ్యక్తిగత వైద్యులు తెలిపారు. ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్‌తో గుండె పైనా ప్రభావం పడే అవకాశం ఉందని వ్యక్తిగత వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను చిన్నవి చేసి చూపిస్తున్న ప్రభుత్వం, అధికారులు చూపిస్తున్నారని వారు చెప్పారు. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

చంద్రబాబు పారామీటర్స్ నార్మల్‌గా ఉన్నాయి: జైళ్ల శాఖ కోస్టల్ డిజిపి రవికిరణ్
చంద్రబాబు పారామీటర్స్ నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపినట్లు ఏపి జైళ్ల శాఖ కోస్టల్ డిజిపి రవికిరణ్ తెలిపారు. శనివారం ఎస్పీ జగదీష్, వైద్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు శరీరంపై దద్దుర్లు ఉన్నాయని, ఆయన ఆరోగ్యంగా ఉండటంతో పాటు 67 కేజీల బరువు ఉన్నారని చెప్పారు. వైద్యులు ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, చల్లని వాతావరణం ఏర్పాటు చేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు. వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలోనే వైద్యం అందించాలని చంద్రబాబు సూచించారని జైలు అధికారులు చెప్పారు. వైద్యుల నివేదికను కోర్టు దృష్టికి తీసుకువెళతామని చంద్రబాబుకు 24 గంటలు వైద్యం అందించనున్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యులతో డాక్టర్ల బృందం మాట్లాడినట్లు,  వారు సూచిస్తే అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామని వెల్లడించారు. జైలుకు వచ్చినప్పుడు వాతావరణం మారుతుందని, ఇంటి వద్ద వాతావరణానికి భిన్నంగా ఉంటుందని రవికిరణ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News