ఒమిక్రాన్ చికిత్సకు వాడుతున్నవి ఇవే
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. విదేశాలనుంచి వచ్చే వారికి కొవిడ్ టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు. ఒమిక్రాన్ నిర్ధారణ అయిన వారిని వెంటనే ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ బాధితులకు కేవలం మల్టీ విటమిన్‌లతో పాటుగా పారా సెటమాల్ మాత్రలను మాత్రమే ఇస్తున్నట్లు ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన 40 మంది బాధితులు చేరగా ఇప్పటికే 17 మంది డిశ్చార్జి అయినట్లు తెలిపారు. ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 67 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా ఇప్పటికే 23 మంది కోలుకున్నారు.‘ఆస్పత్రిలో చేరుతున్న ఒమిక్రాన్ బాధితుల్లో దాదాపు 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు.
కేవలం గొంతు నొప్పి, స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి మాత్రమే కనిపిస్తున్నాయి. లక్షణాలను బట్టి వారికి కేవలం మల్టీ విటమిన్లు, పారా సెటమాల్ మాత్రమే ఇస్తున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే వేరే ఔషధాలు అవసరం లేదని భావిస్తున్నాం’ అని ఎల్‌ఎన్‌జెపిలోని సీనియర్ వైద్యులు ఒకరు చెప్పారు. అయితే విదేశాలనుంచి వచ్చి ఒమిక్రాన్ నిర్ధారణ అయిన వారిలో చాలా మంది ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోగా, ఇద్దరు ముగ్గురు బూస్టర్ డోసు కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఆఫ్రికాకు చెందిన ఓ ఎంపితో పాటుగా, భారత్‌కు చెందిన పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులున్నట్లు ఎల్‌ఎన్‌జెపి వైద్యులు తెలిపారు. ఇక ఢిల్లీలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తిని తెలుసుకునేందుకు పాజిటివ్ వచ్చిన అందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్న్నామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. నగరంలోని నిర్ధారణ కేంద్రాల సహాయంతో నిత్యం 300 నుంచి 400 నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.