వైద్య నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా టీకాల కార్యక్రమం ఇతోధికంగా పెరుగుతున్నా అదింకా చాలదని, టీకాలు తీసుకోకూడదని ప్రజలు ఎవరైనా నిర్ణయించుకుంటే కొత్త మహమ్మారి పుట్టుకొచ్చే ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సంకోచం లేదా సందేహాల కారణంగా, లేదా రవాణా సౌకర్యాలు లేక టీకాలు వేసుకోవడం ఆలస్యమైనా సార్స్ కొవి 2 మహమ్మారి కొత్త రకాలు పుట్టుకు రాడానికి ఎక్కువ బలం , అవకాశం కల్పించినట్టు అవుతుందని వారు హెచ్చరించారు. సార్స్ కొవి 2 కొత్త వేరియంట్లు మొలకెత్తుతున్నాయని, అవి చాలా వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని, వ్యాక్సిన్లను కూడా అవి ప్రతిఘటిస్తాయని అపోలే టెలిహెల్త్ ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ ముబషీర్ అలీ హెచ్చరించారు.
భారత్‌లో ఇంకా వ్యాక్సిన్ అందాల్సిన జనాభా భారీగా ఉండడం, భౌగోళికంగా, ప్రాంతీయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు చాలా సమయం తీసుకోవడం తదితర కారణాల వల్లనే టీకా చాలా మందకొడిగా సాగుతోందని, అందువల్ల సాంకేతికంగానే ఇది సాధ్యమౌతుందని చెప్పారు. జనం టీకాలు తీసుకోడానికి ఇష్టపడేలా ప్రోత్సహించాలని, ఒక వేళ వారు ఇష్టపడక పోతే ఎందుకు ఇష్టపడడం లేదో తెలుసుఉని వారికి టీకాల వల్ల జరిగే మేలుపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలను సరైన అవగాహన కల్పిస్తే టీకాలపై ఎలాంటి సంకోచాలు ఉండబోవని చెప్పారు. కరోనాపై పోరులో ప్రపంచ మంతా సమష్టి భాగస్వామ్యం వహిస్తోందని, అందువల్ల టీకాలు తీసుకోడానికి అంగీకారం, లేదా తిరస్కారాలపై కారణాలను పరిశీలించడం కొనసాగుతోందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల నేడు ఎదుర్కొంటున్న తీవ్ర ముప్పుకు జర్మనీని ఉదహరించారు.
ప్రపంచం మొత్తం మీద సామూహిక కరోనా టీకా కార్యక్రమం వల్లనే సమర్దంగా కరోనా మహమ్మారిని నియంత్రించ వచ్చని అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమాజం ఏకగ్రీవంగా అంగీకరిస్తోందని, ఫరీదాబాద్ క్యూఆర్‌జి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ సుందరి శ్రీకాంత్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోకూడదని ఎవరైనా నిర్ణయించుకుంటే అతనితోపాటు అతని కుటుంబం, సమాజం ఇన్‌ఫెక్షన్ ముప్పులో పడుతుందని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ వల్ల వ్యక్తియే కాకుండా సమాజాన్ని రక్షించినట్టు అవుతుందని, ఇంతేకాకుండా కరోనా నియంత్రణ నిబంధనలకు అనువుగా ప్రవర్తించడం కూడా చాలా అవసరమని పేర్కొన్నారు. సహజసిద్దమైన ఇమ్యూనిటీ సరాసరిన మూడు నెలలు వ్యక్తిలో ఉంటుందని, అదే వ్యాక్సినేషన్ పొందితే సుదీర్ఘకాలం శరీరంలో కొనసాగి రక్షణ కల్పిస్తుందని హెచ్‌ఎంసిటి మణిపాల్ ఆస్పత్రి అంటువ్యాధుల సలహాదారులు అంకిత బైద్య పేర్కొన్నారు.