ప్రధాని లేఖ రాసిన ఢిల్లీ సిఎం కేజ్రివాల్
న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ప్రజలకు నిరంతరాయంగా సేవలు చేసిన వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి ఈ ఏడాది అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆదివారం ఓ లేఖ రాశారు. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు ఇది నిజమైన నివాళి అవుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ కరోనాతో పోరాటంలో చాలా మంది డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారిని భారత రత్నతో సత్కరిస్తే అది వారికి నిజమైన నివాళి అవుతుంది. తమ ప్రాణాలను, కుటుంబాల గురించి ఆలోచించకుండా లక్షలాది మంది డాక్టర్లు, నర్సులు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారు.
వారిని గౌరవించడానికి భారత రత్నతో సత్కరించడం కాక మరే మెరుగైన మార్గం ఉండదు’ అని హిందీలో రాసిన లేఖలో కేజ్రివాల్ పేర్కొన్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని వైద్య సిబ్బందికి ఇవ్వడం కోసం అవసరమైతే నిబంధనల్లో మార్పులు చేయాలని ఆయన గట్టిగా కోరారు. కాగా అంతకు ముందు ఆయన ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు కూడా. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందించిన వివరాల ప్రకారం సెకండ్ వేవ్ సమయంలో ఈ ఏడాది జూన్ మధ్య వరకు దాదాపు 730 మంది డాక్టర్లు కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో బీహార్‌లో అత్యధికంగా 115 మంది చనిపోగా, ఢిల్లీలో 109 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా కరోనా తొలి వేవ్‌లో సైతం 748 మంది వైద్యులు చనిపోయినట్లు ఐఎంఎ చెప్తోంది.