Wednesday, January 22, 2025

వాకర్ తో నడిచిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

వైద్యుల సూచనల మేరకు మెల్లమెల్లగా అడుగులు వేసిన మాజీ సిఎం

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత కెసిఆర్‌ను వాకర్ సాయంతో వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్ సాయంతో బిఆర్‌ఎస్ అధినేత మెల్లగా అడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బిఆర్‌ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, పలువురు రాజకీయ ప్రముఖులు కెసిఆర్ త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని కాంక్షిస్తున్నారు.

శస్త్రచికిత్స తర్వాత కెసిఆర్ ఆరోగ్యం మెరుగుపడిందని యశోద వైద్యులు తెలిపారు. త్వరితగతిన కోలుకునేందుకు అనుకూలంగా కెసిఆర్ శరీరం సహకరిస్తోందని చెప్పారు. మానసికంగా కూడా కెసిఆర్ దృఢంగా ఉన్నారన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా, కెసిఆర్ ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. వైద్యులు సీటీ స్కాన్ సహా అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయన ఎడమ కాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. ఈ మేరకు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం కెసిఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం కెసిఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6 నుంచి -8 వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ ఆరా
బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు. శనివారం బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు అఖిలేష్ యాదవ్ ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు

కెసిఆర్ త్వరగా కోలుకోవాలి : రామోజీ రావు
బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరగా కోలుకోవాలని రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీ రావు ఆకాంక్షించారు. త్వరగా కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం అవుతారని రామోజీ రావు ఆకాంక్షించారు. ఈ మేరకు కెసిఆర్ కుమారుడు, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు రామోజీరావు శనివారం లేఖ రాశారు. కెసిఆర్ తన వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని సాఫల్యం పొందారని, ఈ సవాలును ఆయన అవలీలగా అధిగస్తారని లేఖలో పేర్కొన్నారు. కొన్ని వారాల విశ్రాంతి అవసరమైనా అనతికాలంలోనే కోలుకుని ప్రజాసేవకు రెట్టించిన ఉత్సాహంతో పునరంకితమవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News