ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి బదులు వారిని మరింతగా జవాబుదారీ చేయడానికే కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నది. తాము భారతీయులమని రుజువు చేసుకోడానికి పలు రకాలైన ధ్రువపత్రాలు సంపాదించి పెట్టుకోవలసిన తప్పనిసరి పరిస్థితికి పౌరులను నెట్టివేస్తున్నది. జాతీయ స్థాయిలో ప్రతి పౌరుని జనన, మరణ వివరాలను నిర్వహించడం తప్పనిసరి చేస్తూ కేంద్రం గత బుధవారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు దేశ ప్రజలపై మరో భారాన్ని మోపుతున్నది. ఈ బిల్లు ప్రకారం ఇక ముందు చదువుల్లో చేరడానికి, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు వంటివి పొందడానికి, ఓటరు జాబితాలో చేరడానికి, వివాహ రిజిస్ట్రేషన్‌కు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంకా కేంద్రం భవిష్యత్తులో నిర్ణయించే ఇతర ప్రయోజనాలకు జనన ధ్రువపత్రం (బర్త్ సర్టిఫికేట్) తప్పనిసరి అవుతుంది. ఈ బిల్లు చట్టమైతే నిరక్షరాస్య, నిరుపేద ప్రజలకు అది మరో గుదిబండ అవుతుంది. భవిష్యత్తులో వారికి ఇచ్చే పలు సంక్షేమ సాయాలకు కూడా బర్త్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసే ప్రమాదం పొంచి వున్నది.
ఇప్పటికే ఉపాధి హామీ పథకం వంటి వాటికి ఆధార్ కార్డును అనుసంధానం చేయడం నిరక్షరాస్యులైన గ్రామీణ పేదలకు చెప్పనలవికాని ఇబ్బందులు కలిగిస్తుందనే విమర్శ వెల్లువెత్తుతున్నది. ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఉపాధి హామీ కార్మికుల ఖాతాల్లో మాత్రమే వారి చెల్లింపులు జమ అవుతాయి అని చెప్పడం వల్ల ఆ కార్డులు లేని అనేక మంది పేద కార్మికులు నష్టపోయే ప్రమాదమున్నది. చాలా సార్లు ఒక కార్మికుడి ఆధార్ నెంబర్ మరో కార్మికుడికి లింక్ కావడంతో ఆ డబ్బులు అసలు కార్మికులకు అందవని విమర్శకులు చెబుతున్నారు. ఆధార్ కార్డులోని 7వ సెక్షన్‌ను ఉపాధి హామీ పథకం చెల్లింపులకు అనుసంధానం చేయడం తప్పు అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకెళ్ళడంలోని విజ్ఞతను ప్రశ్నిస్తున్నారు. జనన, మరణాల జాతీయ రికార్డు నిర్వహణ బిల్లు విషయంలో కూడా ఇదే అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఈ వివరాలు కంప్యూటర్లలో చేర్చడం వల్ల అడుగడుగునా పుట్టిన సమయం ధ్రువపత్రాన్ని సమర్పించి తీరవలసిన అగత్యం పౌరులకు కలుగుతుంది. ఆధార్ కార్డు విషయంలోనే ప్రతి దానికీ దాన్ని చూపించాలని అడగడం తప్పు అని న్యాయ స్థానాలు చెప్పాయి. ఆధార్ కార్డును సంక్షేమ పథకాలకు లింక్ చేయడాన్ని అనుమతించిన సుప్రీంకోర్టు ప్రైవేటు సంస్థలు దానిని అడగడాన్ని వ్యతిరేకించింది. పనుల మీద వెళ్ళి లాడ్జింగుల్లో గదులు అద్దెకు తీసుకొనేటప్పుడు ఇప్పటికీ ఆధార్ తప్పనిసరి అయి వుంది. ఆ మేరకు ఆధార్ చట్టం 57వ సెక్షన్‌ను కొట్టివేసింది. పౌరులకున్న గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని అభిప్రాయపడింది.
బర్త్ సర్టిఫికేట్ చూపించాలని డిమాండ్ చేయడం కూడా గోప్యత హక్కు ఉల్లంఘన కిందికే వస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది. జనన ధ్రువీకరణ పత్రాలు పౌరసత్వ సాక్షాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే దేశంలోని ఐదేళ్ళలోపు పిల్లల్లో 38% మందికి బర్త్ సర్టిఫికేట్లు లేవని తేలింది. ఆ పిల్లలందరూ భారతీయులు కారంటే ఎలా? అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) రూపొందించినప్పుడు 40 లక్షల మంది భారత పౌరులు కారని తేలింది. వీరిలో చాలా మంది పిల్లలున్నారు. వారి తలిదండ్రులు వారి జన్మ ధ్రువీకరణ పత్రాలను చూపనందున వారిని విదేశీయులుగా పరిగణించే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వీలైనంత వరకు ప్రతి జననాన్ని, మరణాన్ని నమోదు చేస్తున్నారు. ఆ మేరకు ధ్రువపత్రాలు కూడా ఇస్తున్నారు. కాని ప్రభుత్వం నుంచి పొందవలసిన పలు ప్రయోజనాలకు వాటిని తప్పనిసరి చేయడం లేదు. ఈ బిల్లు ద్వారా బర్త్ సర్టిఫికేట్‌ను అనేక ప్రభుత్వ సహాయాలకు తప్పనిసరి చేస్తే చాలా మంది పేదలు వాటికి వెలి అయిపోతారు. వలస వెళ్ళకపోతే బతకడం కష్టమయ్యే ప్రస్తుత కాలంలో చాలా మంది వలస కార్మికులు ధ్రువపత్రాలను తమ వెంట తీసుకు వెళ్ళలేని పరిస్థితి వుంది. ఒకవేళ తీసుకు వెళ్ళినా అవి తడిసిపోవడమో, కనిపించకపోడమో జరుగుతుంది. అటువంటప్పుడు వారి పరిస్థితి ఏమిటి? వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో వాటిని కాపాడుకొనే శక్తి వుండదు. అసలు దేశంలో పుట్టి పెరుగుతున్న జన బాహుళ్యాన్ని గుర్తింపు పత్రం చూపించాలని అడగవలసిన అవసరం ఎందుకు కలుగుతున్నది? ఇప్పటికీ వయసులో పెద్ద అయిన చాలా మంది వద్ద జనన ధ్రువపత్రాలు వుండవు. వారు ఎప్పుడు పుట్టారో చెప్పుకోలేని పరిస్థితే వుంటుంది. ఏ గాలి వానకో, సంక్రాంతికో, దీపావళికో, అమావాస్యకో పుట్టినట్టు అతి కష్టంగా గుర్తు తెచ్చుకొని చెబుతారు. వీరు అసంఖ్యాకంగా వుంటారు. వీరందరినీ భారతీయులు కారని అందామా! జనన, మరణ జాతీయ రికార్డు అవసరాన్ని తప్పనిసరి చేసే బిల్లును తొందరపడి ఆమోదించకుండా లోతైన పరిశీలనకు అవకాశం కలిగించడం అవసరం.