Sunday, December 22, 2024

రాష్ట్రానికి కరెంట్ కావాలా.. వద్దా?

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌టిపిసి ఘాటు లేఖ
పిపిఎ కుదుర్చుకోకపోతే ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని హెచ్చరిక

మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్తు ఉత్పత్తి కేం ద్రాల్లో రారాజుగా పిలవబడుతున్న ఎన్‌టిపిసి (జాతీయ థర్మల్ విద్యుత్తు సంస్థ) రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఘాటైన లేఖ రాసినట్లు తెలిసింది. రామగుండం ఎన్‌టిపిసిలో రెండో దశ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించడానికి సకల ఏర్పాట్లు చేసుకొన్న ఆ సంస్థలో ఉత్పత్తి అయ్యే 2400 మెగావాట్ల కరెంటులో ఏకంగా 85 శాతం విద్యుత్తును తెలంగాణ రాష్ట్రానికే ఇవ్వాల్సి ఉంటుందని, ఈ కరెంటును తీసుకుంటామని ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత జరిగే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పిపిఎ) కుదుర్చుకునే దశకు వచ్చేసరికి గడచిన 15 నెలలుగా అంతులేని నిర్లక్షం వహిస్తోందని, ఈ కాలయాపనపై ఆగ్రహించిన ఎన్‌టిపిసి తెలంగాణ రాష్ట్ర పవర్ కో-ఆర్డినేషన్ కమిటీకి లేఖ రాసినప్పటికీ ఏ విధమైన స్పందన రాలేదని ఎన్‌టిపిసి ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఎన్‌టిపిసిలో ఉత్పత్తి కాబోయే 2400 మెగావాట్ల కరెంటు తెలంగాణ రాష్ట్రానికి కావాలో? వద్దో ? కూడా తెలియడంలేదని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు విద్యుత్తు అవసరాలు చాలానే ఉన్నాయని, ఒకవేళ తెలంగాణకు కరెంటు అవసరంలేదంటే తాము ఇతర రాష్ట్రాలకు అమ్ముకునేందుకు పిపిఏలు కుదుర్చుకొంటామని ఎన్‌టిపిసి వర్గాలు వ్యాఖ్యానించాయి.

గత జనవరి 29వ తేదీన ఘాటుగా రాసిన లేఖలో ఫిబ్రవరి 10వ తేదీలోగా స్పందించకపోతే ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. దానికి ఫిబ్రవరిలోనే ఒప్పందాలు చేసుకుంటామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తుశాఖాధికారులు ఒప్పందాలు చేసుకుంటామని ఎన్‌టిపిసికి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈనెల 20వ తేదీ వరకూ తెలంగాణ ప్రభుత్వం పిపిఎ చేయలేదని ఆ అధికారులు వివరించారు. ఎన్‌టిపిసిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుకు మొదటి సంవత్సరంలో ఫిక్స్‌డ్ చార్జీల కింద 2.07 రూపాయలు, వేరియబుల్ చార్జీలుగా 2.05 రూపాయలు కలిపి మొత్తం 4.12 రూపాయలకు కె.డబ్లు.హెచ్.గా ధరలున్నాయని, తుది టారిఫ్‌ను కేంద్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తుందని, ఇంతటి కారుచౌకైన ధరలకు విద్యుత్తుకు పిపిఎ చేసుకోవడానికి ఎందుకు ఆలశ్యం చేస్తున్నారో అర్ధంకావడంలేదని ఎన్‌టిపిసి వర్గాలంటున్నాయి. అంతేగాక రామగుండం ఎన్‌టిపిసి ఫేజ్-2 ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిందని, దీనికి కేంద్ర జల సంఘం (సిడబ్లుసి) ఆమోదం కోసం ప్రాసెస్‌లో ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టును ఆమోదించాలని గత 15 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తులు అందలేదని తెలిపారు. అలాగని తాము ఇతర రాష్ట్రాలతో ఇప్పటి వరకూ ఎలాంటి పిపిఎలు కూడా చేసుకోలేదని వివరించారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వంపై ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో 85 శాతం ఇస్తామన్నా గత ఆరు సంవత్సరాలుగా పిపిఎ చేసుకోకుండా చివరికి కేంద్రం హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆ అధికారులు వివరించారు.

కేంద్ర ప్రభుత్వ శక్తి పథకం కింద ఎన్‌టిపిసి రెండోదశలోని 2400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సింగరేణి నుంచి అందించేందుకు స్టాండింగ్ లింకేజి కమిటీ (లాంగ్ టర్మ్) ఆమోదం కుదిరిందని వివరించారు. 2016-17వ ఆర్ధిక సంవత్సరంలోనే ఎన్‌టిపిసి రెండోదశలో 2400 మెగావాట్ల కరెంటు ఉత్పత్తికి 17,739 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనాలు రూపొందించారని, 2022-23వ ఆర్ధిక సంవత్సరం వరకూ వేచి చూసి తాజా ధరలతో తిరిగి మదింపు చేయవలసి ఉందని, అందుకే అప్పటి ప్రభుత్వం పిపిఎ కుదుర్చుకోలేదని వివరించారు. ఆ తర్వాత 2023 అక్టోబర్ నుంచి జనవరి 29వ తేదీ వరకూ తెలంగాణ ప్రభుత్వానికి మూడు లేఖలు రాసినట్లుగా ఎన్‌టిపిసి వర్గాలు తెలిపాయి. దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిన సంగతిని తెలంగాణ ప్రభుత్వానికి వివరిస్తూనే పెరిగిన విద్యుత్తు అవసరాలకు తగినట్లుగా థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సామర్ధాన్ని పెంచాలని ఎన్‌టిపిసి భావిస్తోందని కూడా రాష్ట్ర సర్కార్‌కు వివరించినట్లు తెలిపారు. అందులో భాగంగానే రామగుండం (తెలంగాణ) ఎన్‌టిపిసి స్టేజ్-2 ఒక భాగమని, ఈ ప్రాజెక్టుకు ఫైనాన్షియల్ క్లోజర్స్‌తో పాటుగా పెట్టుబడులు రాబట్టుకోవడానికి పిపిఎ (విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు)లు చాలా అవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే 2400 మెగావాట్లను పూర్తిగా తీసుకుంటామని రాతపూర్వకంగా లేఖ ఇచ్చి ప్రభుత్వంతో పిపిఎ చేయించకపోతే ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును ఇస్తామని ఆఫర్ ఇవ్వడం తప్ప తమకు మరోమార్గం లేదని ఎన్‌టిపిసి గతనెల జనవరి 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర పవర్ కో-ఆర్డినేషన్ కమిటీకి లేఖ రాసింది. అయితే ఈ లేఖకు రాష్ట్ర విద్యుత్తుశాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఎన్‌టిపిసి వర్గాలు పేర్కొన్నాయి.

ఇలా ఎన్‌టిపిసి రాష్ట్ర ప్రభుత్వ సమాధానం కోసం ఇంకనూ ఎదురుచూస్తూనే ఉందని, ఎందుకంటే తెలంగాణ భూభాగంలో ఉత్పత్తి అయ్యే కరెంటును ఇక్కడి అవసరాలకు వినియోగించకుండా ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం తమకు కూడా ఇష్టంలేదని, అందుకే వేచిచూస్తున్నామని ఆ వర్గాలు వివరించాయి. అంతేగాక తెలంగాణ రాష్ట్రానికున్న విద్యుత్తు వినియోగ డిమాండ్ భారీగా ఉందని, లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, గృహ వినియోగానికి సబ్సిడిపై కరెంటు సరఫరా, పారిశ్రామిక రంగానికి, ఐటి, ఫార్మారంగాలకు, నిర్మాణంలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి లిఫ్టు ప్రాజెక్టుకు… ఇలా ఒక్కటేమిటీ ప్రతి విభాగంలోనూ విద్యుత్తు అవసరాలు విపరీతంగా పెరిగిపోయాయని వివరించారు. అంతేగాక అధిక ధరలకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తును కొనుగోలు చేసి ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పరిస్థితుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఉపశమనం కలుగుతుందని, అందుకే ఎన్‌టిపిసి రెండో దశలోని 2400 మెగావాట్ల కరెంటులో ఏకంగా 85 శాతం విద్యుత్తును తెలంగాణ రాష్ట్రానికే వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని, ఇదే న్యాయమని, అందుకే రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ జవాబు కోసం ఎదురుచూస్తున్నామని ఆ అధికారులు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News