Friday, December 20, 2024

కుక్క ఉన్నది జాగ్రత్త!

- Advertisement -
- Advertisement -

ఇటీవల హైదరాబాద్‌లో ఓ బాలుడు కుక్కల దాడిలో చనిపోవడం విచారకరం. అనేక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కుక్కలు చేస్తున్న దాడుల్లో పలువురు గాయాలు పాలవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వివిధ జంతువులపై సరైన పర్యవేక్షణ లేని కారణంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇరవై ఏళ్ళ క్రితం కుక్క కరచిందని వైద్యుని దగ్గరకు వెళ్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాగే కొన్ని ఇళ్లల్లో కుక్క ఉన్నది జాగ్రత్త అనే బోర్డు కూడా కన్పించేది.
అన్ని కుక్కల వల్ల రేబిస్ వస్తుందనేది అపోహ మాత్రమే. రేబిస్ ఒక ప్రాణాంతక వ్యాధి. సాధారణంగా కుక్క కరిస్తే ఈ వ్యాధి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ పిల్లి, కోతి, ముంగిస, ఎలుక ఇలా ఏది కరిచినా రేబిస్ వ్యాధి సోకుతుంది. ఇది తెలియని చాలా మంది కుక్క కాటుకు గురైనా, పిల్లి కరిచినా ఏం కాదులే అని మిన్నకుండిపోతున్నారు.

చికిత్స చేయించుకోవాలన్న ఆలోచన కూడా కొందరు చేయడం లేదు. దీంతో రేబిస్ సోకి పలువురు మృత్యువాత పడుతున్నారు.
రేబిస్ లిస్సా అనే వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే రేబిస్ (హైడ్రోఫోబియా) సోకుతుంది. ఈ వైరస్ రేబిస్ కలిగి ఉన్న కుక్క, పిల్లి, ముంగిస, కోతి వంటి జంతువుల లాలాజలంలో ఉంటుంది. అయితే రేబిస్ కలిగి ఉన్నవీ, లేనివీ ఏవి అన్నది గుర్తించడం కష్టం. కాబట్టి ఆయా జంతువులు ఏవైనా కరిస్తే వెంటనే హ్యూమన్ రేబిస్ హెమోగ్లోబిన్స్ లేదా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. రేబిస్ వైరస్ జంతువులకు చేరకుండా ఉండేందుకు ముందస్తుగా పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయిస్తే ఎలాంటి ప్రమాదమూ ఉండదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా వంటి సంపన్న దేశాలలో ఇదే తరహా విధానాన్ని పాటిస్తారు. అందువల్ల అక్కడ కుక్కల వల్ల ఎవరికీ పెద్దగా రేబిస్ సోకడం లేదు. మన దేశంలో కూడా కొన్నేళ్లుగా పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో చాలా వరకు మరణాలను తగ్గించగలుగుతున్నారు. రేబిస్‌కు వ్యాక్సిన్ కనుగున్న లూయి పాశ్చర్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 28ని రేబిస్ నివారణ దినోత్సవంగా జరుపుతారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దేశంలో ప్రతి ఏటా కుక్క కాటు వల్ల 20 వేల మరణాలు సంభవిస్తున్నట్లు పేర్కొంది. అంటే రోజుకు 50 మంది కుక్క కాటు వల్లే మరణిస్తున్నారన్నమాట. ప్రపంచం మొత్తం మీద జరిగే కుక్కల దాడుల్లో 36 శాతం ఇండియాలోనే జరుగుతున్నట్లు ఒక అంచనా. ఎవరైనా ఒక్కసారి రేబిస్‌కు గురై, వ్యాధి లక్షణాలు కన్పిస్తే, వ్యాధిగ్రస్థులు ఎక్కువ శాతం చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కుక్క లేదా మరేదైనా కరిస్తే అదే రోజు వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి. పిచ్చి కుక్క కరిస్తే రేబిస్ వంద శాతం సోకుతుంది. అయితే పిచ్చి కుక్కకు నిర్వచనం ఇవ్వడం అంత తేలిక కాదు. మనం రెచ్చగొట్టకపోయినా కుక్క కరిచిందంటే దాదాపు అది పిచ్చి కుక్క అయి ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. ఎవరైనా కుక్క కరిస్తే పది రోజుల వరకు ఆ కుక్క బతికి ఉండేలా చూడాలి. ఒక వేళ మధ్యలోనే కుక్క మృతి చెందితే అది పిచ్చి కుక్కగా నిర్ధారించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నా ఫలితం ఉండదు. వైద్యులు చేసిన పరిశోధన ప్రకారం రేబిస్ వైరస్ ఉన్న కుక్క కరిస్తే పది రోజుల నుంచి ఐదేళ్లలోపు ఎప్పుడైనా రేబిస్ వ్యాధి బయటపడవచ్చు. కుక్క కరిచిన తర్వాత రేబిస్ వచ్చే వరకు మధ్య కాలాన్ని ఇంక్యూ బేసిన్ పిరియడ్‌గా పిలుస్తారు. వైరస్ బ్రెయిన్‌కు సోకితే ఆ వ్యక్తి హైడ్రో ఫోబియో (రేబిస్)కి గురైనట్టే లెక్క. ఈ స్థితికి చేరిన వ్యక్తికి మెడ భాగంలో కండరాలు వాచిపోతాయి. ఉమ్మిని మింగడానికి కూడా ఇబ్బంది పడాల్సినంత నొప్పి ఉంటుంది. దీని వల్ల వాటర్ బాటిల్‌ను చూసినా భయంతో పారిపోయే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంటున్నారు. కుక్క కాటుకు గురైన వ్యక్తి గాయాన్ని స్వచ్ఛమైన నీటితో కడగాలి. నీరు లేకుండా శుభ్రమైన వస్త్రాలతో పొడిగా తుడవాలి. కట్టుకట్టకుండా గాయానికి గాలి తగిలేలా చూసుకోవాలి. కుక్క కరిచిన రోజునే వ్యాక్సిన్ ప్రారంభించాలి. యాక్టివ్, మాసివ్ వ్యాక్సిన్లలో ఏది అవసరమైతే అది వాడాలి.

టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి. అలాగే కుక్కలు అరుస్తున్నప్పుడు మనం పరుగెత్తకూడదు. ముఖం, మెడ వంటి భాగాలపై కుక్క కరిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే వ్యాధి నిరోధక టీకాలను ముందు కూడా వేయించుకోవచ్చు. ప్రభుత్వాలు టీకాలను అందుబాటులో ఉంచాలి. అలాగే రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదు. 15 ఏళ్ళలోపు వారు ఎక్కువగా కుక్క కాటుకు గురవుతున్నారు. అడవులను విచక్షణా రహితంగా నరకడం వల్ల వివిధ రకాల జంతువులు ఆవాసం లేక జనాల్లోకి వస్తున్నాయి. ఫలితంగా ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. కుక్కలతో పాటు వివిధ రకాల జీవరాశులకు భూమిపై జీవించే హక్కుఉంటుంది. అయితే మనిషి ప్రాణం అంతకంటే విలువైనది కాబట్టి మన ప్రాణాలను కాపాడుకుంటేనే ప్రభుత్వాలు జీవ వైవిధ్యం ఆవశ్యకతను గుర్తించి ఇతర జీవరాశులను రక్షించే ప్రయత్నం చేయాలి.

యం. రాంప్రదీప్
9492712836

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News