భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి.. తాజాగా వెంకట్రావ్ పేట గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి తోట దివ్య పై ఓ కుక్క దాడి చేసి విచక్షణారహితంగా కరిచింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. దొరికిన చోటల్లా భయంకరంగా దాడి చేయడంతో ఆ దృశ్యం చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు రోజుల క్రితం చింతల బయ్యారం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మునిగెల.సంతోష్ తన మిర్చి చేను దగ్గరికి వెళ్తుండగా కుక్కలు ఆ వ్యక్తిని ఉరుకులు..పరుగులు పెట్టించాయి.
నిత్యం రోడ్ల మీద సంచరిస్తున్న కుక్కలు పాదాచారులపై ప్రతాపం చూపుతున్నాయి.. ఇంత జరుగుతున్నా….గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అధికారులు ఈ కుక్కల బెడదను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. బయటకు రావాలంటే . ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరగాల్సి వస్తుందని . ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.