పెబ్బేరు : వీధి కుక్కుల విహారంతో గ్రామంలో భయం వాతావరణం చోటు చేసుకుంది. పెబ్బేరు మండల పరిధిలోని సూగూరు గ్రామంలో గత రెండు రోజుల నుండి వీధి కుక్కలు అటుగా వెళ్తున్న మహిళలపై దాడులు చేస్తు గాయపరుస్తున్నాయి. ఆది, సోమవారాల్లో సుమారు 6 మంది మహిళలను కరిచి గాయపరిచినట్లు గ్రామస్థులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిర్లక్ష్యంతో కుక్కలు, పందులు వీధుల వెంట తిరుగుతు కుక్కలు గాయపరుస్తుండగా పందులు అంటు రోగాలను అంటి పెడుతున్నాయని గ్రామ ప్రజలు ఆరోపించారు.
గ్రామానికి చెందిన సర్పంచ్ పెద్దికోట్ల వెంకటస్వామి పెబ్బేరులోనే ఉండడంతో గ్రామానికి పెద్ద దిక్కు కరువైంది. గ్రామాభివృద్ధి దేవుడు అడుగు సొంత లాభమే అన్నట్లు గా సర్పంచు వ్యవహారం ఉందని గ్రామానికి చెందిన పెద్దలు ఆరోపించారు. కుక్కల బెడద గురించి పెబ్బేరులో సర్పంచు షాపు దగ్గరకు వచ్చి ప్రజలు మొర పెట్టుకున్న ఫలితం శూన్యంగా కనిపించిందని ప్రస్తుతం ఆ బాధను అనుభవిస్తున్నామని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు కుక్కలను పట్టుకుని దూర ప్రాంతాలకు తరలించాలని లేనిపక్షంలో భవిష్యత్తులో భయం విడనాడదని తెలిపారు.