Thursday, September 19, 2024

కుక్కకాటుకు ఏదీ చెప్పుదెబ్బ?

- Advertisement -
- Advertisement -

వీధి కుక్కల బెడద రానురాను పెరిగిపోతోంది. ఏ వీధి కుక్క ఎటువైపు నుంచి వచ్చి ఏ చిన్నారిపై దాడి చేసి ఈడ్చుకుపోతుందో తెలియదు. ఏ కుక్కల గుంపు ఏ మహిళ మీదపడి కసితీరా కరచి పోతుందో తెలియదు. అడుగు బయటపెట్టాలంటే భయం. వీధిలోకి వచ్చాక అడుగు తీసి అడుగు వేయాలంటే మరింత భయం. నగరాల్లోనే కాదు.. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకిన ఈ కుక్కల బెడదనుంచి రక్షణ లేక సామాన్య జనం అల్లాడుతున్నారు. వీధిలోకి ఒంటరిగా వచ్చిన చిన్నపిల్లలు కుక్కలబారిన పడకుండా సురక్షితంగా తిరిగి ఇంటికి వెళ్తారన్న గ్యారెంటీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రఖ్యాతిగాంచిన వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో శుక్రవారం గుర్తు తెలియని మృత శిశువును కుక్కలు లాక్కు వెళ్లిన సంఘటన వెన్నులో వణుకు పుట్టిస్తోంది.అదే రోజు నార్సింగి పరిధిలో ఓ దివ్యాంగుడిపైకి ఎగబడిన శునకాలు, సిరిసిల్లలో నలుగురు చిన్నారులను కసిదీరా కాటేశాయి. ఇటీవలి కాలంలో వీధి కుక్కల బరితెగింపునకు అడ్డూ ఆపూ లేకుండా పోతోందనడాని చెప్పడానికి ఈ సంఘటనలు చాలు. కుక్కలు చిన్నారులపైనే దాడులకు తెగబడటానికి కారణం లేకపోలేదు.

చిన్నపిల్లల ఎత్తు కుక్కల ఎత్తుకు సమానంగా ఉంటుంది కాబట్టి అవి వారిపై సులువుగా దాడి చేస్తాయి. చిన్నారుల చేతికి తినుబండారాలు ఇచ్చి పంపితే మరీ ప్రమాదం. ఏటా నమోదవుతున్న రేబీస్ కేసులు, మరణాల్లో 60 శాతం 15 ఏళ్ల లోపు పిల్లలలోనే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన ఒక అధ్యయనంలో తేలిన సంగతి గమనార్హం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువ. వీధుల్లో పేరుకుపోయే చెత్త, అపరిశుభ్రంగా ఉండే మురికివాడలు ఉన్నంతకాలం కుక్కలను అరికట్టడం అసాధ్యమనే చెప్పాలి. కుక్కలలో సంతోనోత్పత్తి ఎక్కువ. ఒక అంచనా ప్రకారం రెండు కుక్కలు మూడేళ్లలో వందకు పైగా పిల్లలను కంటాయి. ఇలా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కుక్కల బెడద నివారణకు వాటిని చంపడమొక్కటే పరిష్కారమని కొన్నేళ్ల క్రితం వరకూ ప్రభుత్వాలు భావించేవి.

దానివల్ల పరిష్కారం కనబడకపోగా, జంతు ప్రేమికులు సైతం అభ్యంతరం వ్యక్తం చేయడంతో కుక్కలను చంపడానికి బదులు వాటికి పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేయడం ప్రారంభించాయి. కానీ ఇది అనుకున్నంత వేగంగా, పకడ్బందీగా జరగడం లేదు. ప్రస్తుత సమస్యకు ఇది ప్రధాన కారణం. ముంబయిలో వీధి కుక్కలకు యాంటీ రేబీస్ వాక్సీన్ వేసే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ‘ముంబయి రేబీస్ ఎలిమినేషన్ ప్రాజెక్టు’ పేరిట బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్, వెటరనరీ హెల్త్ విభాగం కలసి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. వీధి కుక్కలను స్టెరిలైజ్ చేయడంతో పాటు వాటికి టీకాలు వేయిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు గాయపడిన కుక్కలు, పిల్లులకు వైద్య సేవలూ అందిస్తున్నాయి. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మన రాష్ట్రంలోనూ ఉన్నప్పటికీ, ప్రధానంగా అవి హైదరాబాద్‌కే పరిమితమవుతున్నాయి. వీటి సేవలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలంటే ప్రభుత్వ సహాయమూ, ప్రోత్సాహమూ అవసరం. పుణె, బెంగళూరు, ఇండోర్ తదితర నగరాల్లోనూ కుక్కల బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కుక్కలు గర్భం దాల్చే సీజన్ మొదలు కావడానికి ముందే వాటికి పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్సలు జరుపుతూ, కుక్కల సంఖ్యను నియంత్రిస్తున్నారు.

రాష్ట్రప్రభుత్వం అధ్యయన నిమిత్తం ఆయా నగరాలకు అధికారుల బృందాలను పంపిస్తే ప్రయోజనం ఉండవచ్చు. వీధి కుక్కల బెడద నివారణకు వాటికి పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేయించడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. కొన్నిచోట్ల వాటి లైంగిక అవయవాలను కూడా తొలగిస్తున్నారు. ఇవి సమస్యకు తక్షణ పరిష్కారాలు కాకపోయినా, భవిష్యత్తులో కుక్కల సంఖ్య తగ్గేందుకు దోహదపడతాయని చెప్పవచ్చు. అయితే కుక్కలను పట్టుకోవడం, వాటిని ఊరికి దూరంగా తరలించి, శస్త్రచికిత్సలు చేయడం, యాంటీ రేబిస్ వ్యాక్సీన్లు వేయడం.. ఇవన్నీ ఖర్చుతోనూ, ప్రయాసతోనూ కూడుకున్న పనులు.

అయితే మనుషుల ప్రాణాలను కబళిస్తున్న కుక్కల బాధ తొలగిపోవాలంటే ఈ ఖర్చూ, ప్రయాస తప్పవు. మున్సిపల్, పశుసంవర్ధక విభాగాలు ఇలాంటి కార్యక్రమాలను అక్కడక్కడ చేపట్టినా నిధుల లేమి, సిబ్బంది కొరత వల్ల ముందుకు సాగడం లేదు. అందువల్ల పురపాలక, పశుసంవర్ధక శాఖల్లో సిబ్బందిని నియమించడంతో పాటు కుక్కల బెడద నివారణకు ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ విభాగాలకు స్వచ్ఛంద సంస్థల సహకారం తోడైతే కుక్కల బాధ శాశ్వతంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు. దీనికి తోడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ రేబీస్ వ్యాక్సీన్‌ను అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News