Monday, January 20, 2025

మోహపాశాల బొమ్మను

- Advertisement -
- Advertisement -

పరవశత్వాన్ని ఒంటికి పులుముకుని
ఒకానొక సంగీతపు ప్రేమనోకవిత్వపు
సంపదనో
నన్ను స్వరాన్ని చేస్తున్నది
పాటలు వినిపిస్తున్న నా రెక్కలలో
ఒకటి ప్రపంచంకోసం విప్పారితే
ఒకటి పరిపూర్ణతకోసం విప్పారుతుంది

చిత్ర జగత్తు చిటికెల పందిరై
క్షణాలకు రుధిరాన్ని పూయిస్తూ
దుఃఖపు చినుకులు రాలుస్తుంటే
ఆస్వాదనల పరంపరగా
నేను జలపాతాల్లో ఎగిరిపడే తుంపరలనై
శిఖరాల లోయల స్వరాల దారుల్లో పయనమౌతాను

మూగబోయిన సిరా చుక్కలలా
ప్రవహిస్తున్న సురాచుక్కలలా
రసస్ఫూర్తి ఊయలలో సాహిత్యపు ఆత్మను
భావాల రజ్జువులతో పట్టుకునే నేను
నీ కను దోయికి
ఒక అనిర్వచనీయ మౌనాన్ని అద్దుతాను
జీవన ఘోషలన్ని
వెనువెంటనే వెంటాడుతుంటే
కలల ఛాయల్లోంచి ఉలిక్కి పడతాను
సముద్ర జాలర్లంత ఆశగా నీటిని నమ్ముకుంటే

పదవిన్యాసాల ’వల’ లను నేనుగా విసురుతానట
కన్నీటిని అమ్ముకోలేని అమ్మగా ఆమెగా
నా రూపుతో చరవాణి ఊపులకు
నిర్బంధపు స్నేహ చిహ్నమై
మచ్చలేని మాట అవుతానట
నన్ను గొలుసుల దిగుడు బావుల నుండి
ఆకాశపు సుందర సౌధాల వరకు
బొమ్మను చేస్తుంటారు

వదిలించుకోలేని రంగుల లోకంలో
వర్ణరహిత చిత్రాన్ని నేను
నీ హృదయ భావాల మొహాన్ని నేను
నీ అరచేతిన ఆటలాడే పాశాన్ని నేను
సెల్ ఫోన్ వాడుకల ’యాప్’ ను నేను

డాక్టర్ కొండపల్లి నీహారిణి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News