Thursday, January 9, 2025

డాలర్ పైపైకి…

- Advertisement -
- Advertisement -

భారత బడా బూర్జువా వర్గం, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలక ప్రభుత్వాలు సామ్రాజ్యవాదంతో రాజీపడి దేశ సహజ వనరులను కట్టబెట్టటమే కాక, దేశ కరెన్సీ అయిన రూపాయి విలువను కూడా అమెరికా సామ్రాజ్యవాదుల దయకు వదిలి వేశా రు. దాని ఫలితమే రూపాయి విలువ పతనమై నేడు డాలర్‌కి 85.7 రూపాయిలుగా ఉంది. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి నిదర్శనం. అధికార మార్పిడి జరిగిన తర్వాత 1947లో ఒక డాలర్‌తో రూపాయి మారకం విలువ 3.50 రూపాయల ఉంది.1948 నుండి 1980 వరకు కొంచెం అటుఇటుగా ఉంది. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత రూపాయి విలువ పతనం ఎక్కువగా జరిగింది.

అధికార మార్పిడి దగ్గర నుంచి 2022 వరకు రూపాయి విలువ 79 సార్లు పడిపోయింది. నేడు రూపాయి విలువ పతనం తారస్థాయికి చేరింది. సామ్రాజ్యవాదం ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదంపై ఎక్కువగా ఆధారపడటం, నూతన ఆర్థిక విధానాల అమలు, ఎగుమతి, దిగుమతుల్లో ఉన్న వ్యత్యాసం, పెద్ద నోట్ల రద్దు, కరోనా సంక్షోభం, ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, తాజాగా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలన్న ఒపెక్ దేశాల నిర్ణయం రూపాయి విలువ పతనానికి కారణంగా ఉంది.

ప్రపంచ చమురు వినియోగించే దేశాల్లో 3వ స్థానంలో ఉన్న భారత్‌కు 85% చమురు దిగుమతిగా ఉంది. చమురే కాకుండా ఫార్మా, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర రంగాలకు అవసరమైన ముడిసరుకులు, వంటనూనెలు, ఆహారధాన్యాలు, పప్పులు, లోహాలను భారతదేశం దిగుమతి చేసుకుంటున్నది. ఈ దిగుమతులకు చెల్లింపులు డాలర్లలోనే జరపాలి. రూపాయి విలువ తగ్గిన ప్రతిసారి దిగుమతుల కోసం చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూ ఉంటుంది. రూపాయి విలువ పడిపోవటం వల్ల దిగుమతి అయ్యే అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి.ధరల పెరుగుదల భారం ప్రజలపైనే పడుతుంది. డీజిల్ ధరలు పెరిగితే, రవాణా చార్జీలు పెరిగి ఉప్పు, పప్పు, ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి.

అంతేకాకుండా ప్రయాణ ఖర్చులు, ఆటోచార్జీలు, బట్టలు, పిల్లల స్కూలు ఫీజులు, ఫోన్లు, టివిలు, ల్యాప్ టాపుల, వాహనాల ధరలు పెరుగుతాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతుంది. రూపాయి పతనం ఫలితంగా బడ్జెట్ లెక్కలు, అంచనాలు మారిపోతాయి. విదేశాలకు ఎగుమతి చేసే వారికి మాత్రం ఆదాయం పెరుగుతుంది. ప్రపంచ దేశాలపై ఏ దేశ పెత్తనం ఉంటుందో, ఆ దేశ కరెన్సీ ఆధిపత్యం చలాయిస్తుంది. 1947 దాకా ప్రపంచ ఆధిపత్యం బ్రిటన్ చేతుల్లో ఉంది. దాని ఫౌండ్ కరెన్సీ, ఇతర దేశాల కరెన్సీపై ఆధిపత్యం చలాయించింది. బ్రిటన్ బలహీనపడిన తర్వాత అమెరికా ప్రపంచ పోలీసుగా వ్యహరిస్తూ, తన డాలర్ కరెన్సీ ఆధిపత్యాన్ని ఇతర దేశాలపై నెలకొల్పింది.

డాలర్ ఆధిపత్యం: చమురును డాలర్లలో చెల్లించాలనే ఒప్పందం కుదరటానికి ముందు అమెరికా కరెన్సీ విలువ ఆ దేశం వద్దనున్న బంగారం నిల్వలతో ముడిపడి ఉంది. 1974 లో సౌదీ అరేబియా తదితర దేశాలు చమురు ఉత్పత్తిని పరిమితం చేయటంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. సౌదీ అరేబియా డాలర్లలోనే చమురు అమ్మకాలు జరపాలని, మిగులు ఆదాయాన్ని అమెరికా ప్రభుత్వ బాండ్లలో మదుపు చేయాలని, దానికి బదులుగా సైనిక, ఆర్థిక సహాయం అందిస్తామని ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాను తన వ్యూహంలో అమెరికా ఇరికించింది. అప్పటి నుండి చమురు ఉత్పత్తి దేశాల్లో డాలర్లలోనే చమురు విక్రయం కొనసాగింది. ముడి చమురుకు ఉన్న ప్రాధాన్యత రీత్యా ఈ ఒప్పందం తర్వాత డాలరు ప్రాధాన్యత బాగా పెరిగింది. ముడి చమురుకు అన్ని దేశాలు డాలర్లలో చెల్లించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రాచుర్యం పొందింది.

అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు డాలర్లలోనే కొనసాగటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యం ఏర్పడింది. డాలర్ గిరాకీ వల్ల ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే దాని విలువ బాగా పెరిగింది. అందరికీ డాలర్లు అవసరం కాబట్టి, దానినే తన ఆయుధంగా వాడుకునేందుకు అమెరికాకు అవకాశం ఏర్పడింది. ఉక్రెయిన్‌తో యుద్ధం వలన రష్యా మీద ఆర్థిక ఆంక్షలు విధించటం డాలర్ ఆయుధీకరణకు నిదర్శనం. అమెరికాకు ఎదురు తిరిగే దేశాలకు డాలర్లు చిక్కకుండా చేస్తే వాటి ఎగుమతులు, దిగుమతులకు విఘాతం ఏర్పడుతుంది. పెట్టుబడులు ఆగిపోతాయి. డాలర్ మారకంలో ఆయా దేశాల కరెన్సీ విలువ పడిపోయి విదేశీ రుణాలపై అసలు, వడ్డీల చెల్లింపులు మోయలేని భారంగా మారుతుంది. ఆయా దేశాల డాలర్ నిల్వలు సాధారణంగా పశ్చిమ దేశాల బ్యాంకుల్లో భద్రపర్చటం జరుగుతుంది.

అందువల్ల అమెరికా తనకు నచ్చిన దేశానికి కావాల్సినంతమేర డాలర్ల ప్రవాహాన్ని పంపనూవచ్చు, నచ్చనప్పుడు ఆ దేశపు బ్యాంకు ఎకౌంట్లను స్తంభింపచేసి డాలర్ల కొరత సృష్టించవచ్చు. ప్రస్తుతం మూడోవంతు ప్రపంచ దేశాలు అమెరికా నుండి ఇటువంటి సమస్యలనే ఎదుర్కొంటున్నాయి. ఇతర దేశాల మెడలు వంచి అవి తన పెత్తనానికి లోబడి ఉండేలా చేయటానికి కూడా డాలర్ పెత్తనం అమెరికాకు తోడ్పడుతుంది. అమెరికాకు ఆయా దేశాలు చేసే ఎగుమతులు కుదించుకుపోతే, ఆ దేశాల దగ్గర ఉన్న డాలర్ నిల్వలు తరిగిపోతాయి. ఫలితంగా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. తమ దేశీయ అవసరాలకు కావలసిన దిగుమతులను అవి డాలర్ ప్రమేయం లేని వ్యాపారం ద్వారా పొందవచ్చు కాని ఇప్పటికే ఆ దేశాలు ఐఎంఎఫ్ లేదా ప్రపంచ బ్యాంకు దగ్గర పొందిన రుణాలు డాలర్లలోనే చెల్లించాల్సిన ఉంది.

అప్పుడు డాలర్ల అవసరం ఆ దేశాలకు తప్పదు. ఆ విధంగా ఐఎంఎఫ్ అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని మద్దతుగా ఉంది. అంతర్జాతీయ వాణిజ్యం డాలర్లలోనే సాగాలనే నిబంధన లేకపోతే చాలా దేశాలు తమ తమ సరుకులను తక్కిన దేశాలతో తేలికగా మార్చుకోవచ్చు. డాలర్‌పై ఆధారపడటం అనేది తగ్గితే అది అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభం చేస్తుంది. అది అమెరికాకు ఇష్టం ఉండదు.

బ్రిక్స్ ఏర్పాటు: వాణిజ్యంలో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలు బ్రిక్స్ దేశాల కూటమిగా ఏర్పడ్డాయి. ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ ఎమిరేట్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా 30 దేశాలు బ్రిక్స్‌లో చేరాలనే ఆలోచన చేస్తున్నాయి. ఐఎంఎఫ్‌కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ దీని ఏర్పాటు లక్ష్యం. అంతర్జాతీయ వాణిజ్యం ఆయా దేశాల కరెన్సీలలోనే జరగాలనే డిమాండ్ ను బ్రిక్స్ ముందుకు తెచ్చింది. బ్రిక్స్ దేశాల జనాభా 310 కోట్లకు పైగా ఉంది. ఇది ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ వ్యవసాయంలో 45% కలిగి ఉన్నాయి. బ్రిక్స్ దేశాలు, తమ ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోని, సమానత్వంతో కూడిన, పరస్పర ప్రయోజనాల ఆధారంగా నిర్వహించు కుంటాయి.

అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రత్యేక అభివృద్ధి బ్యాంకును నెలకొల్పేందుకు బ్రిక్స్ దేశాలు సన్నద్ధమవుతున్నాయి. వీటి ప్రయోజనాలు వీటికి ఉన్నా, అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకోగలిగితే ప్రపంచ వాణిజ్యంలో మార్పులు సంభవిస్తాయి. డాలర్ ఆధిపత్యాన్ని సహించని రష్యా, చైనాలు డాలర్‌కి ప్రత్యామ్నాయంగా ఆ దేశాల కరెన్సీలోనే చెల్లింపులు జరపాలని నిర్ణయించాయి. బ్రిక్స్ వేదికగా సమర శంఖం పూరించాయి. పెట్రోల్ విక్రయంలో డాలర్‌కు సౌదీ అరేబియా స్వస్తి చెప్పటం బ్రిక్స్‌కి బలం చేకూరుతుంది. ఇక నుంచి డాలర్లతో పాటు చైనా యువాన్, ఐరోపా సమాఖ్య (ఇయు)యూరో, జపానీస్ యెన్ ల లోను చెల్లింపులు స్వీకరిస్తామని చెప్పింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కలిసి ఉమ్మడి కరెన్సీ వెలువరించే ప్రయత్నంలో ఉన్నాయి. ఆ కరెన్సీ స్వభావం గురించి ఉమ్మడి అభిప్రాయ రావాల్సి ఉంది.

డాలర్ ప్రమేయం లేకుండా అంతర్జాతీయ వాణిజ్యం జరగాలన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అలా వ్యతిరేకిస్తున్న దేశాలను బెదిరించటానికి ట్రంప్ పూనుకున్నాడు. అమెరికాకు ఆ దేశాలు ఎగుమతి చేసే సరుకులపై 100% సుంకాన్ని విధిస్తామనే బెదిరింపులు చేస్తున్నాడు. ట్రంప్ బెదిరించగానే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ‘ఆర్థిక’ వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశం డాలర్ రహిత వాణిజ్యం పట్ల ఆసక్తిలేదని ప్రకటించటం అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ లొంగుబాటును వెల్లడి చేస్తున్నది. భారత రూపాయి విలువ పతనానికి అధికార మార్పిడి జరిగిన దగ్గర నుంచి నేటి వరకు పాలక ప్రభుత్వాలు అనుసరించిన, అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలతో, డాలర్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించకపోవటం, దేశం స్వయం సమృద్ధిని సాధించే విధానాలు అనుసరించకపోవటం, పెద్ద ఎత్తున చేసిన విదేశీ అప్పులకు డాలర్ల రూపంలో చెల్లించటమే కారణం. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించటం ద్వారానే రూపాయి పతనం ఆగుతుంది.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News