ముంబై: కేంద్ర బడ్జెట్ 2024ను జులై 23న ప్రవేశపెట్టనుండగా, నేడు మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. సెన్సెక్స్ నాలుగు రోజుల రికార్డు రన్ కు నేడు బ్రేక్ పడింది. దాంతో స్టాక్ మార్కెట్ సూచీలు ఎరుపులో క్లోజ్ అయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 738.61 పాయింట్లు లేక 0.90 శాతం పతనమై 80604.65 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 269.95 పాయింట్లు లేక 1.09 శాతం పతనమై 24530.90 వద్ద ముగిసింది. దాదాపు 756 షేర్లు లాభపడగా, 2618 షేర్లు నష్టపోయాయి, 74 షేర్లు మార్పు లేకుండా ముగిశాయి.
ఎన్ఎస్ఈ లో నేడు టాటా టెలిసర్వీసెస్, రైల్ వికాస్ నిగం, జుబిలియంట్ లైఫ్, పేటిఎం షేర్లు లాభ పడగా, చెన్నై పెట్రో, అపార్ ఇండస్ట్రీస్, పర్సిస్టెంట్ సిస్టమ్, జెకె పేపర్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇక బంగారం ధర రూ.809.00 లేక 1.09 శాతం పతనమై రూ. 73346.00 వద్ద ట్రేడయింది. ఇకపోతే అమెరికా డాలరు మారకంలో రూపాయి విలువ 0.06 పైసలు లేక 0.07 శాతం పెరిగి డాలరు మారకం రూ. 83.65 వద్ద ట్రేడయింది.
పేటీఎం నష్టాలు మరింత పెరినా, ఆదాయంలో 33 శాతం క్షీణించినా మార్కెట్ లో దాని షేరు ధర రూ. 10.60 లేక 2.38 శాతం పెరిగి రూ. 455.90 వద్ద ముగిసింది. దీనికి ముందు రోజు రూ.445.30 గా ఉండింది. దాని మార్కెట్ క్యాపిటల్ రూ. 292.21 బిలియన్లుగా ఉంది. దాని యావరేజ్ వాల్యూమ్ 4.99 మిలియన్ లుగా ఉంది.