Wednesday, January 22, 2025

కొనసాగుతున్న మార్కెట్ జోరు.. పెరిగిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 66,000 పాయింట్లను దాటగా, మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ కీలక 19,500 పాయింట్ల మార్క్‌ను దాటింది. గత వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు చూస్తే సెన్సెక్స్ మొత్తంగా 629 పాయింట్లు లాభపడింది. వారాంతం శుక్రవారం సెన్సెక్స్ 502 పాయింట్లు (0.77 శాతం) లాభంతో 66,060.90 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 151 పాయింట్లు లాభంతో 19,564 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఇది గురువారం 19,413.75 పాయింట్ల వద్ద ఉంది. 30 సెన్సెక్స్ కంపెనీలలో 10 మాత్రమే నష్టాలను చవిచూడగా, 20 కంపెనీల షేర్లు బలంగా ముగిశాయి. ఐటి షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. దీంతో సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డు సృష్టించాయి. టిసిఎస్ షేరు దాదాపు 5.15 శాతం లాభపడింది. అలాగే టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో వంటి పెద్ద ఐటి షేర్లు కూడా 4.50 శాతం వరకు పెరిగాయి. సెన్సెక్స్‌లో టాప్ 5 గెయినర్లు ఐటి రంగానికి చెందినవే. ఐటి కంపెనీల త్రైమాసిక ఫలితాలు బాగుండడం వల్ల మార్కెట్లో లాభపడుతున్నాయి. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం పెరగ్గా, టోకు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతానికి పెరిగింది.

మేలో 25 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతానికి దిగొచ్చింది. అయితే కూరగాయల ధరలు పెరగడంతో జూన్‌లో ద్రవ్యోల్బణం పెరిగింది. భారీ వర్షాలు పంటలను దెబ్బతీయడంతో ధరలు పెరిగాయి. జూన్‌లో వినియోగదారుల ఆహార ధరల సూచీ (సిపిఐ) 4.49 శాతానికి పెరిగింది. మేలో ఇది 2.96 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 3.84 శాతంగా ఉంది. మరోవైపు జూన్ నెలలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్లుపిఐ) మైనస్ -4.12 శాతానికి తగ్గింది.

డబ్ల్యుపిఐ వరుసగా మూడో నెల క్షీణతను నమోదు చేసింది. 8 సంవత్సరాలలో ఇదే కనిష్ట స్థాయి టోకు ద్రవ్యోల్బణం కావడం గమనార్హం. అంతకుముందు అక్టోబర్ 2015లో ఇది -మైనస్ 3.81 శాతంగా ఉంది. మే నెలలో ఇది మైనస్ -3.48 శాతం వద్ద ఉంది. గత సంవత్సరం జూన్ 2022లో టోకు ద్రవ్యోల్బణం 15.18 శాతం వద్ద ఉంది. వచ్చే వారం ఈ ద్రవ్యోల్బణం సూచీలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News