Sunday, November 3, 2024

బేర్ గుప్పిట్లోకి..

- Advertisement -
- Advertisement -

Domestic stock markets continue to be at loss

కొద్ది వారాలుగా నష్టాల్లోనే మార్కెట్లు
ఫెడ్ ప్రభావంతో మరింత పతనం
గతవారం 1,385 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 2020 మార్చిలో కరోనా మహమ్మారి పతనం తర్వాత అంతటి స్థాయిలో ఇప్పుడు నష్టాలు కనిపించాయి. గతవారం సెన్సెక్స్ మొత్తంగా చూస్తే 1,385 పాయింట్లు నష్టపోయింది. ప్రధానంగా భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. మార్కెట్లు బేర్ గుప్పిట్లోకి వెళ్లాయి. ఇక గతవారం అమెరికా ఫెడరల్ రిజర్వు మూడు దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంతగా తొలిసారిగా 0.75 శాతం వడ్డీ రేటును పెంచింది. 28 సంవత్సరాల తర్వాత అంటే 1994 తర్వాత ఇది అత్యంత ఎక్కువ రేటు పెంపు కావడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకే అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. మే నెలలో ఇది 8.6 శాతానికి చేరుకుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం రేటును 2 శాతానికి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని, అందుకే రేట్లు పెంచాలని నిర్ణయించామని ఫెడరల్ రిజర్వ్ తెలిపింది. ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం భారతీయ రూపాయిపైనా ప్రభావం ఉంది. రూపాయి మరింత పడిపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇప్పటికే కనిష్ట స్థాయి రూ.78.22కి చేరింది. అయితే గురువారం కాస్త పుంజుకుని 78.07 స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇప్పటికే కనిష్ట స్థాయిలో ఉంది. ఈ పరిస్థితిలో అమెరికన్ బ్యాంక్ చర్య భారతదేశంపై ఒత్తిడిని పెంచింది.

గ్లోబల్ మార్కెట్లు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపైనా ఫెడ్ రిజర్వు ప్రభావం కనిపిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంచడం వల్ల అమెరికా ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావొచ్చు, కానీ భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు ప్రభావాన్ని చూడనున్నాయి. ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేటును పెంచడం వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గవచ్చు. ఇది భారతదేశ దిగుమతి వ్యయంపై ప్రభావం చూపుతుంది. డాలర్ ఖరీదైనది కావడంతో, భారతదేశం దిగుమతి వ్యయం పెరుగుతుంది. దేశం వాణిజ్య లోటును మరింత పెంచుతుంది.

విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ
ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. వరుసగా 9 నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే అమ్మకాల ఒత్తిడి కారణంగా భారత స్టాక్‌మార్కెట్ మరింత దిగువ స్థాయిలను చూస్తుంది. ఇప్పుడు ఫెడ్ రేట్లు పెంచిన తర్వాత డాలర్ రేటు పెరుగుతుంది. దీని కారణంగా భారతీయ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ఉపసంహరణ పెరగవచ్చు. భారతీయ మార్కెట్‌తో పోలిస్తే విదేశీ పెట్టుబడిదారులకు యుఎస్ మార్కెట్ లేదా డాలర్ ఆధారిత మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టడం మరింత లాభదాయకంగా ఉంటుంది. దీంతో భారతదేశ స్టాక్ మార్కెట్ కంటే యుఎస్ మార్కెట్ లేదా ఇతర మార్కెట్లలో ఎక్కువ పెట్టుబడి పెడతారు. భారత్‌లో పెట్టుబడులను తగ్గించడం వల్ల దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గే ప్రమాదం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News