Monday, December 23, 2024

సరికొత్త శిఖరాల నుంచి పతనం దిశగా మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా నాలుగో వారం కూడా పతనమయ్యాయి. మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూస్తున్నాయి. వారాంతం శుక్రవారం సూచీలు నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా భారత స్టాక్‌మార్కెట్ క్షీణతతో ముగింపు పలికాయి. ఈ పతనం కారణంగా సెన్సెక్స్ 65,000 దిగువకు పడిపోయింది. ఐటి, మిడ్‌క్యాప్ షేర్లలో భారీ క్షీణత నమోదైంది.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 202 పాయింట్లు పతనమై 64,948 వద్ద స్థిరపడింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 19,310 పాయింట్లకు చేరింది. ట్రేడింగ్‌లో ఐటిరంగ షేర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ ఐటి 456 పాయింట్ల పతనంతో ముగిసింది. మరోవైపు బ్యాంకింగ్, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లు ఎఫ్‌ఎంసిజి నష్టాలతో ముగిశాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రంగ షేర్లు కూడా డౌన్ అయ్యాయి. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 9 లాభాలతో ముగియగా, 21 నష్టాలతో ముగిశాయి. నిఫ్టీలోని 14 షేర్లు లాభాల్లో, 36 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు నష్టపోయారు.

శుక్రవారం బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.303.39 లక్షల కోట్లకు తగ్గింది. ఇన్వెస్టర్లు రూ.51,000 కోట్ల నష్టాన్ని చవిచూశారు. స్టాక్స్ విషయానికొస్తే, మారుతీ సుజుకీ 0.98 శాతం, రిలయన్స్ 0.75 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.67 శాతం, నెస్లే 0.67 శాతం, హెచ్‌యుఎల్ 0.53 శాతం, ఐటిసి 0.24 శాతం లాభపడ్డాయి. మరోవైపు టిసిఎస్ 2.14 శాతం, టెక్ మహీంద్రా 1.80 శాతం, ఇన్ఫోసిస్ 1.59 శాతం చొప్పున నష్టపోయాయి.

కీలక అంశాలు
గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారతదేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను ‘బిఎఎ3’గా, దేశం దృక్పథం స్థిరంగా ఉంటుందని సంస్థ అంచనా వేసింది. అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతుందని మూడీస్ వెల్లడించింది. అయితే గత 7 నుండి 10 సంవత్సరాలలో భారతదేశ ఆర్థిక పురోగతి రేటులో తగ్గుదల ఉందని మూడీస్ పేర్కొంది. దీనికి ముందు కూడా మూడీస్ భారత్‌కు స్థిరమైన ఔట్‌లుక్‌తో బిఎఎ3 రేటింగ్‌ను ఇచ్చింది.

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఆగస్ట్ 21న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) సమాచారం ఇచ్చింది. రిలయన్స్ ఆర్థిక సేవల వ్యాపారం గత నెలలో దాని మాతృ సంస్థ నుండి వేరు చేశారు. విభజన తర్వాత జియో ఫైనాన్షియల్ షేర్ ధరను ప్రైస్ డిస్కవరీ మెకానిజం కింద రూ.261.85గా నిర్ణయించారు.
గృహ రుణాలు లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో ఇతర రుణాలలో పారదర్శకత కోసం వ్యక్తిగత రుణగ్రస్తులకు ఫిక్స్‌డ్ వడ్డీ రేటు విధానం లేదా రుణాల కాలపరిమితి పొడిగింపునకు అనుమతి ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది.

వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రజలకు మరింత సులభతర విధానం అందించేందుకు గాను ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) గురువారం ఉడ్గామ్ (అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్ ఇన్‌ఫర్మేషన్)ను ప్రారంభించింది. ద్రవ్యోల్బణం లక్షం పరిధిని దాటడం వల్ల ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆహార ధరల పెరుగుదల కారణంగా రిటైల్, టోకు ద్రవ్యోల్బణం పెరిగింది. ఇది ఆర్‌బిఐ లక్షం పరిధిని దాటడంతో మరోసారి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపునకు సిద్ధం కావొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తెలిపింది.

అదానీ గ్రూప్ తన స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును ముగించేందుకు మరో 15 రోజుల సమయం కావాలని సోమవారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సుప్రీం కోర్టును కోరింది. జులైలో దేశీయ ఎగుమతులు 32.25 బిలియన్ డాలర్లతో 15.88 శాతం క్షీణించాయి. గతేడాది ఇదే సమయంలో ఎగుమతులు 38.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆస్ట్రేలియా లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జిక్యూజి పాట్నర్స్‌కు మరో దఫా అదానీ కంపెనీల్లో భారీ ఎత్తున వాటాలను కొనుగోలు చేసింది. జిక్యూజి పలు బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ పవర్‌లో దాదాపు 1.1 బిలియన్ డాలర్లు (రూ.9 వేల) పెట్టుబడులు పెట్టింది.

ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ గంగ్వాల్ కుటుంబం తమ కంపెనీలో దాదాపు రూ.3,730 కోట్ల విలువచేసే వాటాలను విక్రయించింది. కంపెనీ ఈక్విటీ వాటాను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ప్రమోటర్ రాకేష్ గంగ్వాల్ ఈ వాటాలను అమ్మారు. డీల్‌కు ఆఫర్ ఫ్లోర్ ధర రూ.2400, ఇది కంపెనీకి చెందిన షేరు ముగింపు ధర రూ.2,549తో పోలిస్తే 5.8 శాతం డిస్కౌంట్‌కు సేల్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News