1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
1,024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఆర్‌బిఐ సమీక్ష కఠినంగా ఉండనుందనే అంచనాల నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1,024 పాయింట్లు (1.75 శాతం) పడిపోయింది. ఆఖరికి 57,621 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 303 పాయింట్లు కోల్పోయి 17,214 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎల్ అండ్ టి షేరు అత్యధికంగా 3.6 శాతం పతనమైంది. ఇంకా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నష్టాలను చవిచూశాయి. సెనన్సెక్స్ 30లో 5 స్టాక్స్ మాత్రమే పెరిగాయి. వాటిలో పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎస్‌బిఐ, ఎన్‌టిపిసి, అల్ట్రాటెక్ సిమెంట్ ఉన్నాయి. ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద సోమవారం ఒక్క రోజులోనే రూ.3 లక్షల కోట్లకు పైగా తగ్గింది. అయితే గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ సుమారు 1,950 పాయింట్లు పడిపోయింది. ఈ మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు రూ.6.7 లక్షల కోట్లు నష్టపోయారు. ఫిబ్రవరి 2న బిఎస్‌ఇ లిస్టెడ్ షేర్ల మార్కెట్ విలువ రూ.270 కోట్లుగా ఉంటే సోమవారం ఇది రూ.264 లక్షల కోట్లకు పడిపోయింది.
అమెరికా బాండ్ ఈల్డ్, క్రూడ్ ఆయిల్ రేట్ల పెరుగుదల నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) పెద్ద మొత్తంలో అమ్మకాలు చేపట్టారు. ఇది మార్కెట్ల భారీగా పతనానికి కారణమైంది. ఎఫ్‌ఐఐలకు ఇష్టమైన హెవీవెయిట్ స్టాక్స్ హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సాంకేతికంగా నిఫ్టీ 50డిఎంఎ దిగువకు పడిపోగా, ఇది మంచి సంకేతం కాదు. 17,200 మద్దతు స్థాయి, ఇక్కడి నుంచి కోలుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దిగువకు 17,000/16,800 స్థాయి, అలాగే ఎగువ 17,450-/17,500 స్థాయిని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు రెండు పతనమయ్యాయి. స్మాల్‌క్యాప్ అత్యధికంగా 1.3 శాతం డౌన్ కాగా, మిడ్‌క్యాప్ 0.8 శాతం క్షీణించింది. వ్యక్తిగత స్టాక్స్‌లో టొరెంట్ పవర్, అపోలో హాస్పటల్స్, ఎన్‌ఎఎం ఇండియా, టాటా కన్జూమర్ ప్రొడక్ట్, జూబిలియంట్ ఇండస్ట్రీస్, డిలింక్ ఇండియా, డబ్లుపిఐఎల్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా భారీగా పతనమైన వాటిలో ఉన్నాయి. మరోవైపు గోద్రెజ్ ప్రాపర్టీస్, అదానీ పవర్, ఆయిల్ ఇండియా, పిఐ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎవరెడీ, జిఎన్‌ఎఫ్‌సి పెరిగాయి.
పతనానికి కారణాలు
విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు
క్షీణించడం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) మార్కెట్‌ల నుండి నిష్క్రమిస్తున్నారు. పెరుగుతున్న ప్రపంచ బాండ్ ఈల్డ్ నేపథ్యంలో జపాన్, యూరప్ వంటి ఆకర్షణీయ మార్కెట్‌లకు వారు తరలివెళుతున్నారు. దీంతో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి మొదటి నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పిఐలు భారతీయ మార్కెట్ల నుండి రూ.6,834 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం, ఎఫ్‌పిఐలు ఈక్విటీల నుండి రూ. 3,627 కోట్లు, డెట్ సెగ్మెంట్ నుండి రూ. 3,173 కోట్లు, హైబ్రిడ్ సాధనాల నుండి రూ. 34 కోట్లు వెనక్కి తీసుకున్నారు.
క్రూడ్ ఆయిల్ 93 డాలర్లు
అంతర్జాతీయమార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్ 93 డాలర్లు దాటింది. ఈ క్రూడాయిల్ రేటు గత ఏడేళ్లలో అత్యధికం కావడం గమనార్హం. అయితే ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. డిమాండ్‌తో పోలిస్తే ప్రపంచ సరఫరా మందగించడం, రష్యా, పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికాలో ప్రతికూల వాతావరణం కారణంగా క్రూడ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అధిక డిమాండ్ దృష్ట్యా ముడి చమురు ధర త్వరలో బ్యారెల్ 100 డాలర్లకి చేరే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
అమెరికాలో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం
అమెరికాలో ద్రవ్యోల్బణం గత నెలలో అత్యంత వేగంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ద్రవ్యోల్బణం 7 శాతం పెరిగింది. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు గురువారం నుండి రానున్నాయి. వడ్డీ రేట్లను పెంచడానికి ఫెడరల్ రిజర్వ్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అదే సమయంలో గత నెలలో ఉద్యోగాలు 4,67,000 పెరిగాయని గణాంకాలు చూపిస్తున్నాయి. ఇది సెంట్రల్ బ్యాంక్ రేట్లు పెంచడానికి దోహదం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 2022లో ఫెడ్ వడ్డీరేట్లను ఐదుసార్లు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్ల ప్రభావం
సోమవారం గ్లోబల్ మార్కెట్‌లో మిశ్రమ ధోరణి ఉంది. జనవరిలో ఊహించిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలను అమెరికా సృష్టించినట్లు శుక్రవారం డేటా వచ్చింది. దీంతో పెట్టుబడిదారులు ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపుపై అంచనా వేస్తున్నారు. డౌజోన్ క్షీణతతో ముగిసింది. ఎస్ అండ్‌పి 500, నాస్‌డాక్ లాభాలతో ముగిశాయి.