ఢిల్లీ : దేశంలో రక్షణ సైనిక ఉత్పత్తులు వ్యవస్థల స్వదేశీకరణ ప్రక్రియలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం మూడవ జాబితాను విడుదల చేస్తారు. రక్షణ సైనిక పాటవానికి సంబంధించి భారతదేశం అత్యధిక స్థాయిలో స్వదేశీ పాటవానికి సంకల్పించింది. ఈ క్రమంలో దిగుమతులను తగ్గించుకునే చర్యలకు దిగింది. ఏఏ ఉత్పత్తులు ఈ జాబితాల పరిధిలోకి వస్తాయనేది వరుస క్రమంలో తెలియచేస్తున్నారు.
గురువారం ఈ దిశలో మూడవ దేశీయ ఉత్పత్తుల జాబితాను విడుదల చేస్తారని అధికారులు బుధవారం తెలిపారు. వచ్చే అయిదేళ్ల కాలంలో రూ 2,10,000 కోట్ల పైగా విలువ చేసే ఉత్పత్తుల తయారీకి ఆర్డర్లను దేశీయ పరిశ్రమకు ఇవ్వాలని తలపెట్టారు. ఈ క్రమంలో మూడో జాబితాలో ఏఏ రకం ఉత్పత్తులు వ్యవస్థలు ఉంటాయనేది వెల్లడవుతుంది. తొలి జాబితాలో 101 ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. ఆర్టిలరీ గన్స్, స్వల్ప దూర ఉపరితల గగన క్షిపణులు, క్రూయిజ్ మిస్సైల్స్, తీర ప్రాంత గస్తీ నౌకలు ఉన్నాయి. ఈ లిస్టును 2020 ఆగస్టులో వెలువరించారు. గత ఏడాది మేలో 108 మిలిటరీ ఆయుధాలు, సిస్టమ్స్ దిగుమతులకు సంబంధించి అదనంగా ఆంక్షలను వెలువరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.