రాష్ట్ర కోటాలోని నివాస
ఆధారిత రిజర్వేషన్లు
రాజ్యాంగ విరుద్ధం
ఆర్టికల్ 14కు ఇది
వ్యతిరేకం నివాస కోటా
50శాతం సీట్లను నీట్
మెరిట్ ఆధారంగానే
భర్తీ చేయండి సుప్రీం
కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ : రాష్ట్ర కోటా కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి) వైద్య కోర్సుల్లో సీట్లకు నివాస ఆధారిత రిజర్వేషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అది రాజ్యాంగంలోని అధికరణం 14కు విరుద్ధం అని కోర్టు స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాలకు గతంలో కేటాయించిన 50శాతం కోటాల కింద పిజి వైద్య కోర్సుల్లో ప్రవేశం ప్రతిభ ఆధారంగా అంటే నీట్ స్కోర్లపై మాత్రమే జరగవలసి ఉంది కనుక కోర్టు తీర్పు కీలకమైనది. భారత పౌరు లు, నివాసులుగా ‘మనకు ఎక్కడైనా నివాసం ఎంచుకునే హక్కు ఉన్నది. భారత్ వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని ఎంచుకునే హక్కును కూడా రాజ్యాంగం మనకు కల్పిస్తోంది’ అని న్యాయమూర్తులు హృషీకేశ్ రాయ్, సుధాం శు ధులియా, ఎస్‌విఎన్ భట్టితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘మనం అంతా భారత భూ భాగంలో స్థానికులమే. ప్రొవిన్షియల్ లేదా రాష్ట్ర స్థానికత అనేది ఏదీ లేదు, ఒకే ఒక స్థానికత ఉన్నది. మనం అంతా భారత్ వాసులం. భారత్‌లో ఎక్కడైనా నివా సం ఎంచుకునే, దేశంలో ఎక్కడైనా వర్తకం, వృత్తి చేసే హక్కు మనకు ఉన్నది’ అని కోర్టు వెల్లడించింది.
‘భారత్ వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని ఎంచుకునే హక్కును కూడా రాజ్యాంగం మనకు ఇస్తోంది’ అని బెంచ్ తెలిపింది. ‘ఒక నిర్దిష్ట రాష్ట్రంలో నివసించే వారి కోసం’ రిజర్వేషన్ల ఆలోచన చేసి ఉండవచ్చునని, అయితే, అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనే అని కూడా కోర్టు గుర్తించింది. ‘స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ల ప్రాముఖ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే నివాసం ఆధారంగా ఉన్నత స్థాయిలో రిజర్వేషన అధికరణం 14కు విరుద్ధం’ అని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికే మంజూరైన నివాసిత ఆధారిత రిజర్వేషన్లను ఈ తీర్పు ప్రభావితం చేయబోదని, అటువంటి ఎంపిక నిబంధనల ఆధారంగా తమ డిగ్రీలను పూర్తి చేసిన విద్యార్థులపై కూడా ప్రభావం ఉండదని కోర్టు తెలియజేసింది. ఈ కేసే 2019 నాటిది. పిజి వైద్య కోర్సులకు స్థానికత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగవిరుద్ధమన్న పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను సుప్రీం కోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. అయితే, ఈ పరిస్థితి ప్రాముఖ్యాన్ని కోర్టు గుర్తించి ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ కేసును నివేదించింది.