అమెరికా అధ్యక్ష ఎన్నికలు పట్టుమని పదిరోజులు కూడా లేవు. ఈలోగా అధ్యక్ష రేసులో ఉన్న మాజీఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో అభియోగం వచ్చింది. స్టాసీ విలియమ్స్ అనే అమెరికా మాజీ మోడల్ 1993లో ట్రంప్ తనను అసభ్యకరంగా తాకినట్టు వెల్లడించారు. ట్రంప్‌తో తనకున్న పరిచయం గురించి ఆమె వివరించారు . ఈమేరకు ప్రముఖ మీడియా సంస్థ “ది గార్డియన్ ” పత్రిక కథనం పేర్కొంది. 1992లో ట్రంప్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో డేటింగ్‌లో ఉన్న ఆమెను ఓ పార్టీలో ట్రంప్‌కు పరిచయం చేశారు. “ కొన్ని రోజుల తరువాత ఓ రోజు జెఫ్రీ నన్ను, న్యూయార్క్ లోని ట్రంప్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. నన్ను చూసి జెఫ్రీ , ట్రంప్ నవ్వుకున్నారు. అప్పుడే ట్రంప్ నన్ను తన వైపునకు లాక్కొని ఎంతో అసభ్యంగా తాకారు”
అని కమలాహారిస్ ప్రచార బృందానికి ఈ విషయాన్ని ఆమె ఫోన్‌కాల్ ద్వారా తెలియజేసినట్టు కథనం పేర్కొంది. జెఫ్రీ, ట్రంప్ మంచి స్నేహితులని, వారిద్దరూ ఎంతో సమయం గడిపేవారని స్టాసీ విలియమ్స్ తెలిపారు. అతడు 20 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. దీనిపై ట్రంప్ ప్రచార బృందం ఇదంతా కట్టుకథగా కొట్టిపారేసింది. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారొల్‌పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనలో ట్రంప్ దోషిగా న్యూయార్క్ కోర్టు తేల్చగా, 5 మిలియన్ డాలర్లు ట్రంప్ చెల్లించవలసి వచ్చింది. శృంగార తార స్టార్మీ డేనియల్‌తో కూడా ట్రంప్‌కు అనైతిక సంబంధాలున్నాయన్న కేసులో దోషిగా తేలారు. ఇప్పుడు ట్రంప్‌పై మాజీ మోడల్ ఆరోపణలు చేయడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.