ఇండియా మాపై 100శాతం ఆటో టారిఫ్‌లు విధించింది
ఇప్పుడు మా సమయం వచ్చింది ఉక్రెయిన్ అధ్యక్షుడు
జెలెన్ స్కీ నుంచి శాంతి సందేశం గ్రీన్‌లాండ్‌ను ఏదో
రకంగా వశం చేసుకుంటాం చమురు నిక్షేపాలను తవ్వుకుని
ద్రవ్యోల్బణం తగ్గించుకుందాం కాంగ్రెస్ సంయుక్త
సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు
రికార్డు స్థాయిలో 100 నిమిషాల పాటు ప్రసంగం
వాషింగ్టన్ : భారత్, చైనా సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాల విధింపునకు అ మెరికా సిద్ధమైంది. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని అ మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై 10 శాతం ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా 20 శాతానికి వాటిని పెం చ డం విశేషం. అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత బుధవారంనాడు తొలిసా రి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. పలు దేశాలపై విధిస్తున్న సుంకాల అంశాన్ని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు. ‘పలు దేశాలు దశాబ్దాల పాటు మాపై టారిఫ్‌లు విధిస్తున్నాయి. ఇప్పుడు మా సమయం వచ్చింది. ఆ రకంగా చూస్తే ఐరోపా యూనియర్ , చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో వంటి చాలా దేశాలు మా నుంచి అధికంగా వసూలు చేస్తున్నాయి.
భారత్ మాపై 100 శాతానికి పైగా ఆటో టారిఫ్‌లు విధించింది. ప్రస్తుత వ్యవస్థలపై అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదు. అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆయా దేశాలపై మేం కూడా ప్రతీకార సుంకాలు విధిస్తాం. వాళ్లు ఎంత విధిస్తే మేమూ అంతే వసూలు చేస్తాం. వీటివల్ల అమెరికా మరింత సంపన్నంగా మారుతుంది. గొప్పదేశంగా మళ్లీ అవతరిస్తుంది. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచే అమలు చేయాలని భావించాం. కానీ ఏప్రిల్ ఫూల్ అనే మీమ్స్ బారిన పడలేను. కాబట్టి 2 నుంచి అమలు చేయబోతున్నా ’అని ట్రంప్ వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో విమానాశ్రయంలో ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడి అమెరికన్లను పొట్టనపెట్టుకున్న అంతర్జాతీయ ఉగ్రవాది చిక్కాడని, అతడి అరెస్ట్‌లో పాక్ సహకరించిందని, ఆ ఉగ్రవాదికి అమెరికా చట్టాల ప్రకార శిక్ష విధిస్తామని సభ్యు హర్షధ్వానాల నడుమ ట్రంప్ ప్రకటించారు.
ఆ ఉగ్రవాది మహ్మద్ షరీఫుల్లాగా మీడియా కథనాలు పేర్కొన్నాయి. గ్రీన్‌లాండ్ మనదేనని, దానిని అమెరికాకు అప్పగించాలని ఆ దేశ అధికార పార్టీకి ట్రంప్ సూచించారు. ఇప్పటి వరకు ఆ ద్వీప దేశం స్వయం సమృద్ధికి అమెరికా ఎంతగానో తోడ్పడిందని, ఏదో ఒక రకంగా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా స్వర్ణ యుగం ఇప్పుడే ఆరంభమైందన్నారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా టెక్సాస్‌కు చెందిన డెమొక్రాట్ సభ్యుడు ఆల్ గ్రీన్ నిరసన తెలిపారు. వైద్య సాయాన్ని తగ్గించాలని ఆదేశించే హక్కు మీకు లేదని అతడు నినదించడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ దశలో స్పీకర్ కలుగజేసుకుని అతడ్ని చాంబర్ నుంచి పంపించాలని ఆదేశించారు. మరోవైపు తొలిసారి ఒక అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే మొదటిసారి ట్రంప్ సుమారు 100 నిమిషాల పాటు ప్రసంగించారు. గతంలో బిల్ క్లింటన్ పేరిట ఈ రికార్డు ఉండేది దాన్ని ఇప్పుడు ట్రంప్ అధిగమించారు.
జెలెన్‌స్కీ నుంచి కీలక సందేశం
ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నుంచి తనకు ముఖ్యమైన సందేశం వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ శాశ్వత శాంతిని కోరుకుంటోందని, అందుకోసం రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని నివారించడానికి చర్చలకు సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీ తెలియజేశారని చెప్పారు. ఉక్రెయిన్లు కంటే ఎవరూ శాంతిని ఎక్కువగా కోరుకోరని ఆయన చెప్పారన్నారు. రష్యా సైతం యుద్ధం ముగిసి పోవాలని కోరుకుంటున్నట్టు ఆ దేశాధ్యక్షుడు పుతిన్ నుంచి కూడా బలమైన శాంతి సంకేతాలు అందాయని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్‌పై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును డెమోక్రాట్లు వ్యతిరేకిస్తుండడంపై ఆయన మాట్లాడుతూ ‘ యుద్ధం వల్ల ప్రతివారం వేలాది మంది రష్యన్లు, ఉక్రెయిన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఇది మరో పదేళ్లు కొనసాగాలని మీరు కోరుకుంటున్నారా ’ అని ప్రశ్నించారు. యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కు ఆర్థిక మద్దతు ఇవ్వడం కంటే రష్యా నుంచి తీసుకునే చమురు పైనే ఎక్కువ డబ్బు ఖర్చు చేశాయని పేర్కొన్నారు. వాటితో పోల్చితే అమెరికా అత్యధికంగా కీవ్‌కు వందల బిలియన్ల సహాయం అందించిందని పునరుద్ఘాటించారు.
‘బంగారం’ ఉంది, తోడుకుందాం…
ఏ దేశానికి లేని విధంగా మన కాళ్ల కింద ద్రవరూప బంగారం (చమురు, గ్యాస్‌ను ఉద్దేశించి) ఉందని, అది ద్రవ్యోల్బణ సమస్యను తీరుస్తుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ సమస్య గురించి ప్రస్తావిస్తూ జోబైడెన్ పాలన లోని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ ద్రవ్యోల్బణ సమస్యను పారదోలడం కోసం మేం చేసే పోరాటంలో భాగంగా ఇంధన వ్యయాన్ని వేగంగా తగ్గించడంపై దృష్టి పెట్టాం. బైడెన్ పాలన లో 100 కు పైగా విద్యుత్ ప్లాంట్లు మూసివేశారు. వాటిలో చాలా ప్లాంట్లను మేం ఇప్పుడు తెరవబోతున్నాం. అందుకే నేను అధికారం లోకి రాగానే జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని విధించాను. మనకాళ్ల కింద బంగారాన్ని తోడటం ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. దానిని డ్రిల్ బేబీ డ్రిల్ అంటారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడు డ్రిల్ బేబీ డ్రిల్ అనగానే, రిపబ్లికన్ చట్టసభ్యులు ఆయనతో పాటు ఆ పదాన్ని నినదించారు.