అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తమ తుంపరితనం చాటారు. ప్రత్యర్థి కమలాహారిస్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు.ఆమె కన్నా తానే బాగున్నానని వ్యాఖ్యానించారు. పైగా ఆమె నవ్వు మరీ భయంకరం అని కూడా స్పందించారు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ప్రచారసరళి ఈ వ్యాఖ్యలతో వేడెక్కింది. కమలా హారిస్‌రూపం, తన రూపాన్ని పోల్చుకుంటూ తన ముందు ఆమె వెలవెలే అన్నారు. మరి ఆమెను ఇటీవల టైమ్ మేగజైన్ ఎందుకు ముఖచిత్రానికి ఎంచుకుందో తెలియడం లేదని ట్రంప్ స్పందించారు. శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార సభలో మాట్లాడారు. హారిస్ పట్ల ఈ పత్రిక వారు బాగా ఉదారతను చాటుకున్నారు. వీరి సంగతి ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంటూ ఈ క్రమంలో ఆయన కమలా హారిస్ అందం గురించి పేలవ రీతిలో మాట్లాడం వివాదాస్పదం అయింది.
59 ఏండ్ల ఆమె ఏ విధంగా ఉంది? 78 ఏండ్లు వచ్చిన నేను ఏ విధంగా కనబడుతున్నాను? మీరే పోల్చుకోండని సభికులను ప్రశ్నించారు. ఆమె ఫోటోలు అనేకం ప్రచురించారు. లాభం లేకుండా పోయిందేమో చివరికి బొమ్మలు వేసే సాయం తీసుకుని ఆమె బొమ్మ గీయించారని, ఆమె పట్ల వారికి ఎందుకింత పెద్ద మనస్సు ? అని ప్రశ్నించారు. ప్రచార పర్వంలో ఎప్పుడూ దూకుడుగా మాట్లాడటం ట్రంప్ నైజం అయింది. ఇంతకు ముందు కూడా తనకు ఎవరు రాజకీయంగా ఎదురొచ్చినా వారిని తిట్లతో ముంచెత్తడం ట్రంప్ తంతు అయింది. పెన్సిల్వేనియా సభలో ట్రంప్ దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. ముందుగా ఆయన కమలా హారిస్ ఆర్థిక విధానాలపై మండిపడ్డారు. కానీ ఆయన ప్రసంగం దారితప్పి , చివరికి హారిస్‌పై వ్యక్తిగత దాడికి దారితీసింది. నవంబర్ 5న జరిగే ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా పాలసీల గురించి మాట్లాడాలని, పక్కదారులు వద్దని ట్రంప్ మిత్రులు కూడా చెపుతూ వస్తున్నారు. అయితే వీటిని పెడచెవిన పెట్టి ట్రంప్ మరో సారి తన నైజం చాటుకున్నారు.
నవంబర్ ఎన్నికలలో ఈ రాష్ట్రం జయాపజయాల ఖరారుకు అత్యంత కీలకం. అక్కడ మొత్తం 19 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఆయన ఇక్కడ బైడెన్ కన్నా తక్కువ ఓట్లు పొందారు. ఇక్కడి సభలోనే ఆయన తన ప్రత్యర్థి మారాడని, ముందు తెరపైకి వచ్చిన బైడెన్ ఎటు పోయినట్లు? మధ్యలోనే జారుకున్నారు. ఇప్పుడు వేరే వ్యక్తి రంగంలోకి వచ్చారు. ఇప్పుడు తాను ఎదుర్కొంటున్నది ఎవరిని? ఓహ్ ఈ హారిస్‌నా? ఇంతకూ ఈ హారిస్ ఎవరండి బాబూ అని చమత్కరించారు. ఈ మధ్యనే ఆమె దేశ ఆర్థిక విధానాలకు సంబంధించి చెప్పిందని, ఇవన్నీ అవాకులుచవాకులు తప్పితే ఏమీ కాదని స్పందించారు. ధరలు తగ్గిస్తామని, పన్నుల మోత ఉండదని చెపుతున్న ఆమె ఇంతకు ముందటి హయాంలో ఏం చేశారని నిలదీశారు. బైడెన్‌ను అమాయకుడిని చేసి , ఆయన సీటును దొంగిలించారని చెప్పారు. బైడెన్‌కు కమలా అంటే వొళ్లు మంట, ఆమెను లోపలలోపల తిట్టుకుంటూ ఉంటారని వ్యాఖ్యానించారు.
దేశంలో ఉపద్రవకర ద్రవ్యోల్బణం తీసుకువచ్చి , ఇప్పుడు ఆమె తీరిగ్గా సోషలిస్టు ధరల నియంత్రణ పంథాకు దిగుతానని చెపుతున్నారని, చేసిందేమిటీ? ఇప్పుడు చెపుతున్నదేమిటీ? అని ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇతరత్రా విషయాలను ప్రస్తావించిన హారిస్ వర్గం ఆయన మరో సభ మరోసారి అదే ప్రదర్శన అని తిప్పికొట్టారు.